భారతదేశపు న్యాయవ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్రం ముందడుగు వేసింది. హోంమంత్రి అమిత్‌షా మూడు ప్రధాన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ అనే ఆ బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. ఆ కొత్త చట్టాలు నేటినుంచీ, అంటే 2024 జులై 1 నుంచీ అమల్లోకి వచ్చాయి.
గతంలో ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అమల్లో ఉండేవి. వాటి స్థానే ఈ కొత్త చట్టాలు నేటినుంచీ అమలవుతున్నాయి. పాత చట్టాల స్థానంలో చేసిన కొత్త చట్టాల్లో కొన్ని కొత్త అంశాలున్నాయి. ఆధునిక కాలానికి తగినట్లు, ఆధునిక టెక్నాలజీల వినియోగాన్నీ, ఆధునిక నేర పద్ధతులనూ అవగాహన చేసుకుంటూ అందరికీ న్యాయం అందుబాటులోకి రావడమే ప్రధాన ధ్యేయంగా ఈ కొత్త చట్టాలకు రూపకల్పన జరిగింది. వీటిద్వారా వీలైనంత వేగంగా న్యాయం అందజేయడం, వర్తమాన అవసరాలకు తగినట్లు న్యాయ వ్యవస్థను పనిచేయించడం ప్రధాన లక్ష్యాలు.
కొత్త చట్టాలు కేవలం నేరస్తులను శిక్షించడానికే పరిమితమైపోకుండా, న్యాయం జరిగేలా చూడడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. బాధితులకు వేగంగా న్యాయం చేయడం, న్యాయవ్యవస్థను, న్యాయస్థానాల పనితీరునూ బలోపేతం చేయడం, న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మీద ఈ కొత్త చట్టాలు దృష్టి సారించాయి. వాటి ప్రధాన లక్ష్యం వేగంగా న్యాయం అందజేయడం, న్యాయ వ్యవస్థ నిర్వహణను బలోపేతం చేయడం, అందరికీ న్యాయం అందేలా చేయడం. ఈ కొత్త చట్టాలలో కొత్తగా పొందుపరిచిన అంశాలు… బాధితుల హక్కులను రక్షించడానికీ, సమర్ధవంతమైన దర్యాప్తుకూ, నేరాలను ప్రభావశీలంగా ప్రోసిక్యూట్ చేయడానికీ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
కొత్త చట్టాలు పాత చట్టాల కంటె ఎలా విభిన్నమైనవి?:
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ అనే మూడు కొత్త చట్టాలూ న్యాయాన్ని అందించే ప్రక్రియలోని జాప్యాన్ని నివారిస్తాయి. కేసుల విచారణ, అప్పీళ్ళు, శిక్షల అమలు నిర్దిష్ట సమయంలోగా జరిగేలా చేస్తాయి. తద్వారా అనంతంగా జాప్యం జరిగే పద్ధతికి స్వస్తి పలుకుతాయి.
భారతీయ న్యాయ సంహిత: ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన ఈ చట్టంలో క్రిమినల్ నేరాల నిర్వచనాన్నీ, పరిధినీ ఆధునిక కాలానికి అనుగుణంగా సవరించారు. నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న సైబర్ క్రైమ్‌లు, మహిళలూ చిన్నారులపై జరిగే దాడుల వంటి కొత్త తరహా నేరాలను జోడించారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత: ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వచ్చింది. దీనిలో క్రిమినల్ జస్టిస్‌లోని విధానపరమైన అంశాలను సరళీకరించారు. వేగవంతమైన దర్యాప్తు, ట్రయల్ పూర్తి చేయడానికి స్పష్టమైన గడువు, బెయిల్ మంజూరు లేదా కస్టడీకి కఠినమైన నియమ నిబంధనలు ప్రవేశపెట్టారు.
భారతీయ సాక్ష్య అధినియమ్: ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రస్తుత డిజిటల్ యుగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక ప్రగతిని అందిపుచ్చుకుంది. ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ సాక్ష్యాలను ఈ కొత్త చట్టం అంగీకరిస్తుంది. తద్వారా నమ్మదగిన, పటిష్టమైన సాక్ష్యాలను స్వీకరిస్తుంది. ప్రాదేశిక, స్థానికేతర సాక్ష్యాలను పరిగణించడం, బాధితులకు రక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
ఈ కొత్త చట్టాలను పార్లమెంటు 2023 డిసెంబర్ 21న ఆమోదించింది. వాటికి రాష్ట్రపతి డిసెంబర్ 25న ఆమోద ముద్ర వేసారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కొత్త చట్టాలు 2024 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫై చేసింది.
కొత్త చట్టాల పనితీరుకు ఉదాహరణ:
2000 సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉన్న 7 రాజ్ రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేసారు. ఆ ఘటనలో ముగ్గురు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఆ ఘటనలో ప్రధాన కుట్రదారు అయిన మొహమ్మద్ ఆరిఫ్‌ను అరెస్ట్ చేసారు.
2005లో ట్రయల్ కోర్ట్ ఆరిఫ్‌కు మరణ శిక్ష విధించింది. ఆ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు 2007లో సమర్ధించింది. ఆ ఉత్తర్వులను 2011లో సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఆరిఫ్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను 2012లోనూ, క్యురేటివ్ పిటిషన్‌ను 2014లోనూ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2014 సెప్టెంబర్‌లో, సుప్రీంకోర్టు బెంచ్ ఓ కొత్త రూలింగ్ ఇచ్చింది. దాని ప్రకారం హైకోర్టులు విధించే మరణ శిక్షలను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించాలి. దాని ఆధారంగా ఆరిఫ్ తన రివ్యూ పిటిషన్‌ను మళ్ళీ హియరింగ్‌కు అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం 2022లో తిరస్కరించింది. 2024 జూన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆరిఫ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించారు.
ఆరిఫ్ ఇప్పుడు మళ్ళీ, తన మరణ శిక్షను మానవత్వ కారణాల మీద జీవితఖైదుగా మార్చాలంటూ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. గత 24ఏళ్ళుగా తాను అనుభవించిన మానసిక చిత్రవధను కారణంగా చూపి అతనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. మానవహక్కుల కార్యకర్తలు, ప్రముఖ అడ్వొకేట్లు అతనికి అండగా నిలవవచ్చు. చివరికి సుప్రీంకోర్టు సైతం అతని విజ్ఞప్తిని మన్నించి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చనూవచ్చు. తద్వారా భారతీయ పన్నుచెల్లింపుదారుల ఖర్చులతో ఆరిఫ్, జైల్లో బ్రతకవచ్చు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వస్తే అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలేయనూవచ్చు.
2000 సంవత్సరంలో ఎర్రకోటపై ఉగ్రదాడి చేసిన మహమ్మద్ ఆరిఫ్ కేసు మన న్యాయవ్యవస్థలోని సమస్యలను స్పష్టంగా చూపిస్తోంది. ఎన్నో అప్పీళ్ళు, పిటిషన్లు, రివ్యూలతో అతని కేసు 20ఏళ్ళుగా సాగుతూనే ఉంది. మన న్యాయవ్యవస్థలోని సంక్లిష్టతలను, వాటివల్ల న్యాయం అమలులో జరుగుతున్న జాప్యాలనూ ఎత్తిచూపుతోంది.
హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టాలు న్యాయపరిధిని ఆధునికీకరించడం ద్వారా, అటువంటి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
వేగంగా న్యాయం: కోర్టులో ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలన్నది భారతీయ న్యాయ సంహిత లక్ష్యం. అనవసరమైన సంక్లిష్టమైన ప్రక్రియలను తగ్గించడం ద్వారా కొత్త చట్టం కేసుల విచారణను వేగవంతం చేస్తుంది. నిర్దిష్ట సమయం లోగా న్యాయం అందేలా చేస్తుంది. దానివల్ల ఆరిఫ్ కేసులో కనిపించిన సుదీర్ఘ జాప్యాలను అడ్డుకోవడం సాధ్యమవుతుంది.
కచ్చితమైన కాలావధి: దర్యాప్తును, విచారణను పూర్తి చేయడానికి కచ్చితమైన కాలావధిని నిర్ణయించడం అనవసరమైన జాప్యాలను అడ్డుకోగలదు. ఆరిఫ్ కేసులో లీగల్ ప్రోసెస్‌ను వేగవంతం చేసిఉంటే త్వరగా నిర్ణయం వచ్చి ఉండేది, సుదీర్ఘ జాప్యం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించగలిగి ఉండేది.
జ్యుడీషియల్, కోర్ట్ నిర్వహణా వ్యవస్థలు బలోపేతం:
కేసుల సమర్ధ నిర్వహణ: కొత్త చట్టాల ప్రధాన లక్ష్యాల్లో కోర్టుల నిర్వహణను మెరుగుపరచడం ఒకటి. కేసులను సమర్థంగా ట్రాక్ చేయడం, వనరులను తెలివిగా వినియోగించుకోవడం, సాంకేతికతను అనువుగా వాడుకోవడం దీనిలోని అంతర్భాగాలే. అలాంటి మార్పుల వల్ల కేసులను సమర్ధంగా హ్యాండిల్ చేయవచ్చు, వాటిని పెండింగ్ పెట్టడం తగ్గించవచ్చు, న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం సాధ్యమవుతుంది.
ప్రత్యేక బెంచిలు: కొన్ని రకాల కేసులకు ప్రత్యేక బెంచిలు ఏర్పాటు చేయడం వల్ల తీర్పులు మరింత వేగంగా, మరింత నిలకడగా వెలువడతాయి. సంక్లిష్టమైన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా అనవసర జాప్యాలు లేకుండా కేసులను పరిష్కరించడం సాధ్యమవుతుంది.
అందరికీ అందుబాటులో న్యాయం:
హక్కుల సంరక్షణ: న్యాయప్రక్రియలో బాధితులు, నిందితులు, ఇంకా కేసులో ప్రమేయమున్న ప్రతీఒక్కరి హక్కులనూ రక్షించడం మీద కొత్త చట్టాలు దృష్టి సారించాయి. ఆరిఫ్ కేసునే తీసుకుంటే నేరం తీవ్రతను, నిందితుడి హక్కులను, సమయానుకూలమైన తీర్మానాన్నీ సమతూకంగా చేయాలన్నది కొత్త చట్టాల లక్ష్యం.
సమర్ధమైన దర్యాప్తు, విచారణ: భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, కేసుల దర్యాప్తులను, విచారణలనూ మరింత సమర్థంగా పూర్తి చేయడానికి సహకరిస్తుంది. చట్టం అమలులో మెరుగైన శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాల వల్లనే కేసులు మరింత సమర్థంగా వాదించవచ్చు, దానివల్ల విచారణలూ వేగవంతం అవుతాయి. తద్వారా న్యాయాన్ని తగినంత వేగంగా అందించడం సాధ్యమవుతుంది.
కొత్త చట్టాలలోని వర్తమాన అంశాలు:
టెక్నాలజీ వాడకం: న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతికతల వినియోగం న్యాయ వ్యవస్థలో జాప్యాలను గొప్పగా పరిహరించింది. డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ వ్యవస్థలు, వర్చువల్ హియరింగ్‌లు, డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపించడం వంటివి న్యాయప్రక్రియను మరింత వేగవంతం, మరింత సమర్ధంగా వినియోగించుకోవచ్చు. అలా వ్యవస్థ కూడా మరింత వేగంగా స్పందిస్తుంది. తద్వారా న్యాయాన్ని సులభంగా అందుకోవడం సాధ్యమవుతుంది.
మానవతా కారణాలు, పునరావాసం:
సమతూకమైన న్యాయం: కేసుల విచారణ తర్వాత విధించే శిక్షలు న్యాయబద్ధంగానూ, సమతూకంగానూ ఉండేలా కొత్తచట్టాలు వీలు కల్పిస్తాయి. న్యాయం జరగాల్సిన అవసరాన్నీ, కేసులో మానవీయ కోణాన్నీ రెండింటినీ పరిగణనలోకి తీసుకునేలా చేస్తాయి. ఆరిఫ్ కేసు లాంటి కేసుల్లో కొందరు వ్యక్తులు ఏళ్ళ తరబడి జైల్లో గడుపుతూ భావోద్వేగ ఒత్తిడికి లోనవుతారు. వాటిని అరికట్టేందుకు, న్యాయం చెప్పే దశలో మరింత దయతో వ్యవహరించేలా ఉండాలి.
ఈ సంస్కరణల లక్ష్యం, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను నిష్పాక్షికంగా, వేగంగా, సులభంగా అందరికీ అర్ధమయ్యేలా చేయడమే. ఆరిఫ్ కేసులాంటి సంక్లిష్టమైన కేసులో ఆ మార్పులు, న్యాయం కేవలం వేగవంతంగానే కాదు, నిష్పాక్షికంగానూ ఉండేలా చూస్తాయి. తద్వారా నేరానికి తగిన శిక్షలు సమయానికి పడేలా చేస్తాయి. అలా ప్రజల హక్కులను కాపాడుతూనే న్యాయస్థానాల పనితీరు వేగవంతంగా ఉండేలా కొత్త చట్టాలు చేస్తాయి.
ఈ చట్టాలను సమర్ధంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోడానికి, పోలీసు, న్యాయ వ్యవస్థలలోని అధికారులకు విస్తృతమైన శిక్షణ ఇవ్వాలి. జోన్లవారీగా ఇచ్చే శిక్షణ ద్వారా కొత్త చట్టాలను సమగ్రంగా అర్ధం చేసుకోవాడం, కొత్త చట్టాల ప్రకారం సులువు అవుతుంది,
ఆధునిక ప్రపంచపు అవసరాలను తీర్చేలా కొత్తచట్టాలను అప్డేట్ చేసారు. తాజా శిక్షల్లో సమాజసేవ, దర్యాప్తులు చేయడంలో మెళకువలు, డిజిటల్ సాక్ష్యాలను ఎలా హ్యాండిల్ చేయాలి వంటి అంశాలను వాటిలో చర్చించారు. ఈ మార్పుల వల్ల బాధితులకు న్యాయం మరింత వేగంగా అందడం, బాధితుల హక్కుల కోసం రక్షణగా ఉండడం సాధ్యమవుతుంది.
కొత్త మూడు న్యాయాలూ, భారతదేశం క్రిమినల్ చట్టాలను సులువుగా ఎదుర్కొనేలా చేస్తాయి. విచారణ వేగవంతం చేస్తాయి. కేవలం శిక్షలు విధించడమే న్యాయం కాదని వెల్లడిస్తాయి. వాటి లక్ష్యం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పాదుగొల్పడం, నిష్పాక్షికంగా సమయానుకూలంగా అందరికీ న్యాయం చేయడమే.