పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన మొత్తంతోపాటు, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం రూ.7 వేలు అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో ఉదయం ఆరుగంటలకే సీఎం చంద్రబాబునాయుడు వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందించారు. స్వయంగా లబ్దిదారుడి ఇంటికి వెళ్లి సీఎం పింఛన్ల డబ్బును ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 65.18 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. పాలకొల్లులో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పింఛను లబ్దిదారుల కాళ్లు కడిగి డబ్బు పంపిణీ చేశారు. సాయంత్రానికి నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, చేతివృత్తుల వారి పింఛన్లను రూ.3 నుంచి రూ.4 వేలకు పెంచారు. దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచారు. నూరు శాతం వికలాంగులకు రూ.15 వేలు ఇవ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛను అందించనున్నారు.