ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసాక, నరేంద్రమోదీ తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని నిన్న ఆదివారం మళ్ళీ మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో ఆయన అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. దానిపై కాంగ్రెస్ విచక్షణా రహితంగా విమర్శలు చేసింది.
మూడోసారీ ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ, పాలక పక్షాన్ని విమర్శించడానికి ఏ చిన్న విషయాన్నీ వదలడం లేదు. అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఆ పార్టీ నేత జైరాం రమేష్ విమర్శించారు. దానికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
జైరాం రమేష్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో మోదీపై ట్వీట్ చేసారు. ‘‘అసహజ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో అరకు వ్యాలీ ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌ను తనే కనుగొన్నట్టుగా అభిప్రాయం కలిగించారు. నిజానికి గిరిజనులతో కాఫీ సాగు చేయించాలనే ఆలోచన చేసి, దానికి రూపమిచ్చింది నాంది ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 2007 డిసెంబర్ 21న అరకు కాఫీ ప్రారంభోత్సవానికి కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా నేను హాజరయ్యాను. ఐదేళ్ళ తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మళ్ళీ వెళ్ళాను’’ అంటూ జైరాం రమేష్ ట్వీట్ చేసారు.
మోదీ తన మన్‌కీ బాత్‌లో గిరిజన సాధికారత గురించి మాట్లాడుతూ అరకు కాఫీ గురించి మాట్లాడారు. ఆ సందర్భంగా, చంద్రబాబునాయుడితో కలిసి అరకు కాఫీ తాగిన విషయం గురించి ఎక్స్‌లో ట్వీట్ చేసారు. దాన్ని ఉటంకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు సైతం మరోసారి కలిసి కాఫీ తాగుదామంటూ స్పందించారు. అయితే కాంగ్రెస్ దాన్ని కూడా విమర్శించడం గమనార్హం. దాన్నే తప్పుపట్టారు ఏపీ విద్యామంత్రి లోకేష్. జైరాం రమేష్‌కు ఎక్స్‌లోనే జవాబిచ్చారు.
‘‘గౌరవనీయ జైరాం రమేష్ గారూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరకుకాఫీ గురించి మాట్లాడినది నేను విన్నాను. ఆయన ఎక్కడా అరకు కాఫీని తానే కనిపెట్టినట్టు మాట్లాడలేదు. అది ఎన్నో యేళ్ళుగా ఏపీ సంస్కృతిలో భాగం. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంస్థ గురించి ప్రధానమంత్రి స్పష్టంగా ప్రస్తావించారు. ఒక జాతీయ పార్టీ నేతగా మీ నుంచి నిజాయితీ, హుందాతనాన్ని ఆశిస్తాము. అరకు కాఫీ గురించి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం, చంద్రబాబునాయుడు గారితో కలిసి తాను కాఫీ తాగిన ఫొటోను పంచుకోవడం, ఏపీలో ప్రతీఒక్కరినీ సంతోషపరిచింది’’ అని నారా లోకేష్ జైరాం రమేష్‌కు తన ట్వీట్‌తో జవాబిచ్చారు.