వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించిన నీట్ పరీక్షల్లో లోపాలు తలెత్తడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారికి మరలా రీ టెస్ట్ నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 1563 మంది గ్రేస్ మార్కులు రద్దు చేశారు. వారిలో 813 మంది రీ టెస్టుకు హాజరయ్యారు. 750 మంది డుమ్మా కొట్టారు.తిరిగి పరీక్షలు రాసిన వారి ర్యాంకులు మారాయని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ తెలిపింది. ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.
త్వరలో నీట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్షల్లో అవకతవకలు రచ్చకు దారితీశాయి. కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బిహార్‌లో పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరలా నీట్ పరీక్షలు నిర్వహించాలని పిటిషన్ వేసినా అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ పనితీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.