క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో నేటినుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రొవిజన్లను అనుసరించి మొదటి కేసు ఢిల్లీలో నమోదయింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ చేరువలో రహదారిని ఆక్రమించి దుకాణం నడుపుతున్న వ్యక్తి మీద పోలీసులు కేసు పెట్టారు.
కమలానగర్ వద్ద రైల్వేస్టేషన్ సమీపంలో ఒక ఫుట్-ఓవర్-బ్రిడ్జి కింద ఒక చిరువ్యాపారి రహదారిని ఆక్రమించి చిన్న దుకాణం నడుపుతున్నాడు. రాత్రివేళల్లో సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, మంచినీళ్ళ వంటి వస్తువులు విక్రయించడానికి తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసం రహదారిని ఆక్రమించాడు. ప్రజలు ప్రయాణించే రహదారిని అడ్డుకోవడం వల్ల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దుకాణాన్ని అక్కడినుంచి తొలగించమని పోలీసులు పదేపదే చెప్పినా అతను పట్టించుకోలేదు. దాంతో స్థానిక ఎస్సై ఆ దుకాణం ఎలా ప్రజా రవాణాకు అడ్డుగా ఉందో వీడియో తీసి, దాని సాయంతో కేసు పెట్టాడని ఎఫ్ఐఆర్ కాపీ ద్వారా తెలిసింది.
నిందితుడి పేరు పంకజ్‌కుమార్. అతను బిహార్ రాజధాని పట్నా నుంచి దేశ రాజధానికి వచ్చాడు. వీధుల మీద వ్యాపారం చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. అయితే రహదారికి అవాంతరం కలిగించాడన్న నేరం కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ‘భారతీయ న్యాయ సంహిత’లోని సెక్షన్ 285 ప్రకారం ప్రజల సొమ్ము అయిన రహదారులను ఆక్రమించి ప్రజారవాణాను అడ్డుకుని, తద్వారా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే అటువంటి వ్యక్తికి గరిష్ఠంగా రూ.5వేల జరిమానా విధించవచ్చు. ఆ సూత్రం ఆధారంగానే భారతీయ న్యాయ సంహిత ప్రకారం మొదటి కేసు నమోదయింది.