అరుకు కాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోదీ, మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ‘మన్ కీ బాత్’ వేదికగా ప్రజలతో మోదీ పలు విషయాలు పంచుకున్నారు. అరకు కాఫీ రుచి గురించి కూడా ప్రస్తావించారు. తాను కూడా అరకు కాఫీకి అభిమానినే అని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆ తర్వాత ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి 2016లో అరకు కాఫీని తాగుతున్న ఫొటోలను షేర్ చేశారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామని వెల్లడించారు. అరకు కాఫీ గిరిజన సాధికారతతో ముడిపడి ఉంది అని మోదీ వివరించారు. ఆ ఫొటోలో మోదీ, చంద్రబాబుతో పాటు మాజీ గవర్నర్ నరసింహన్, కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ ఉన్నారు.
ప్రధాని మోదీ ట్వీట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.‘‘మా గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధ ఆసక్తితో అరకు కాఫీని సాగు చేస్తారని’’ బదులిచ్చారు. అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఏపీ ప్రజల హద్దుల్లేని శక్తిసామర్థ్యాలకు ఇది అరకు కాఫీ నిదర్శనంగా నిలవడంతో పాటు 2016లో మనం అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసినందుకు, అచ్చంగా ఏపీలోనే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు థాంక్యూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారూ’’ అని ట్వీట్ లో తెలిపారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను అని సీఎం చంద్రబాబు ట్వీట్ లో కోరారు.