ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే ఉమ్మడి పరీక్షా విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29కి విరుద్ధంగా పరీక్ష విధానం ఉందని తీర్పులో పేర్కొంది.
ఏపీలో 2022లో తీసుకొచ్చిన ఈ విధానం, విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొన్న హైకోర్టు, పిల్లలను నిర్దిష్ట సమయంలో అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని పేర్కొంది. విద్యార్థులను పరీక్షల పేరిట భయాందోళనకు గురిచేసినట్లుందని అభిప్రాయపడింది. సీబీఏ ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత తీర్పు చెప్పారు.
సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రాం (SALT) లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరక్టర్ 2022 అక్టోబరులో ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. దీనిని యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ ఛైర్మన్, మరొక విద్యా సంస్థ కార్యదర్శి 2022లో హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా హైకోర్టు తీర్పు చెప్పింది.
గతంలో ఫార్మెటివ్ పరీక్షలను స్కూల్ స్థాయిలోనే నిర్వహించేవారు. పాఠశాల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాలు రూపొందించి పరీక్షలు నిర్వహించేవారు. ప్రపంచ బ్యాంకు రుణంతో వైసీపీ ప్రభుత్వం సాల్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించాల్సిన ఫార్మెటివ్ పరీక్షలను రెండుసార్లు OMR షీట్తో సీబీఏగా నిర్వహిస్తున్నారు. మిగతా రెండింటికి ప్రశ్నపత్రాలను ఎస్సీఈఆర్టీ రూపొందించి పంపిస్తోంది. ఇందుకోసం ప్రైవేటు స్కూల్స్ నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు.