దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ -2024 టైటిల్ పోరులో భారత్ విజయం సాధించింది. సఫారీ జట్టుపై భారత్ ఏడు పరుగుల తేడాతో నెగ్గి రెండోసారి టీ20 విభాగంలో విశ్వవిజేతగా అవతరించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 177 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ముందు ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఓవర్ లోనే తొలి వికెట్ నష్టపోయింది. బుమ్రా వేసిన తొలి ఓవర్ మూడో బంతికి రిజా హెండ్రిక్స్(4) బౌల్డ్ అయ్యాడు. ఏడు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సఫారీలు 12 పరుగుల వద్ద రెండో వికెట్ గా మార్ క్రమ్ (4) ఔట్ కావడంతో ఇబ్బందుల్లో పడ్డారు. అర్ష్ దీప్ బౌలింగ్ లో 2.3 బంతిని ఆడిన మారక్రమ్ రిషబ్ పంత్ కు క్యాచ్ గా చిక్కాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా రెండు వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. డికాక్, స్టబ్స్ క్రీజులో ఉన్నారు.
అక్షర్ పటేల్ వేసిన 8.5 బంతికి స్టబ్స్(31 ) బౌల్డ్ అయ్యాడు. స్టబ్స్ 21 బంతులు ఆడాడు. ఒక సిక్స్ తో పాటు మూడు ఫోర్లు కొట్టాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సఫారీ జట్టు మూడు వికెట్లు నష్టపోయి 71 పరుగులు చేసింది. అర్ష్ దీప్ వేసిన 12.3 వ బంతిని డీకాక్, కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ గా అందించి పెవిలియన్ చేరాడు. డీకాక్ 31 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
క్లాసిన్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను ఉత్కంఠభరితంగా మార్చాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఏకంగా ఐదు సిక్సులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
హార్దిక్ పాండ్యా వేసిన 16.1 బంతికి క్లాసెన్ ఔట్ అయ్యాడు. పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో భారత్ విజయంపై మళ్ళీ ఆశలు రేగాయి. 17 ఓవర్లు ముగిసే సరికి సఫారీ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 155 గాఉంది. 18 వ ఓవర్ నాలుగో బంతికి మార్కో యాన్సెన్(2) ను బుమ్రా ఔట్ చేశాడు.
హార్దిక్ పాండ్యా వేసిన 19.1 బంతికి డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో డేవిడ్ మిల్లర్ (21) వెనుదిరిగాడు.19.5 బంతికి రబాడ(4) ఔట్ అవడంతో భారత్ విజయం ఖరారైంది.
భారత బౌలర్లలో హార్దిక్ మూడు, అర్ష్ దీప్ రెండు, బుమ్రా రెండు, అక్షర్ ఒక వికెట్ తీశారు.