టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ రోహిత్ శర్మ స్కోర్ బోర్డు 23 వద్ద ఉన్నప్పుడు ఔట్ అయ్యాడు. కేశవ మహరాజ్ వేసిన రెండో ఓవర్ లో వరుసగా రెండు ఫోర్లు బాది నాలుగో బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. నాలుగో బంతిని ఆడబోయి పెవిలియన్ చేరాడు. రెండో ఓవర్ చివరి బంతికి రిషబ్ పంత్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టపోయి 2 పరుగులు చేసింది. రబాడా వేసిన 4.3 బంతికి సూర్యకుమార్ యాదవ్(3) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 34 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్లు నష్టపోయింది. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ స్కోర్ 45/3 గా ఉంది.
విరాట్ కోహ్లీ(25), అక్షర్ పటేల్ (8) క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ, పటేల్ విలువైన 72 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 13 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ బోర్డును 98కి చేర్చారు. కానీ కాసేపటికే అక్షర పటేల్ రన్‌ఔట్ అయ్యాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసిన అక్షర పటేల్, నాలుగు సిక్సులు, ఒక ఫోర్ బాదాడు. అక్షర పటేల్ పెవిలియన్ చేరడంతో శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ 48 బంతుల్లో అర్థసెంచరీ కొట్టాడు. నోకియా వేసిన 17 వ ఓవర్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 134/4 కాగా, 18 ఓవర్లకు 150 పరుగులకు చేరింది. కోహ్లీ 59 బంతులు ఆడి 76 పరుగులు చేశాడు. మార్కో జాన్సన్ బౌలింగ్ లో కసిగో రబాడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో రెండు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. 163 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ నష్టపోయింది.
కోహ్లీ తర్వాత హార్థిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 174 పరుగుల వద్ద శివమ్ దూబే ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆన్రిచ్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ కు దొరికిపోయాడు. దూబే 16 బంతులు ఆడి 27 పరుగులు చేశాడు. 20 ఓవర్ ఆఖరు బంతికి జడేజా (2) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్, నోకియా చెరి రెండు వికెట్లు తీయగా, జాన్సన్, రబాడా చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలిచింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ చాంపియన్లుగా నిలవాలని తహతహలాడుతున్న టీమిండియా… నేటి ఫైనల్ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగింది. దక్షిణాఫ్రికా జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవు.