హర్యానాలోని నుహ్ జిల్లా షా చౌఖా గ్రామంలో కొంతమంది ముస్లిములు ఒక వ్యక్తిని నిర్బంధించి దాడి చేసారు. ఆ వ్యక్తి కూడా ముస్లిమే. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మౌసీమ్ అనే వ్యక్తి పింగ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షా చౌఖా గ్రామంలో నివసిస్తున్నాడు. జూన్ 18 అర్ధరాత్రి స్థానికంగా ఒక వివాహం జరిగింది. ఆ పెళ్ళి సందర్భంగా డీజే ఏర్పాటు చేసారు. దాన్ని చూడడానికి మౌసీమ్ తన స్నేహితులైన కాసిమ్, హఫీజ్‌లతో కలిసి వెళ్ళాడు. అక్కడ అక్కి, జుబేర్, మరికొందరు వ్యక్తులు మౌసీమ్‌ను అతని మిత్రులను చూసి దూషించడం మొదలుపెట్టారు.
హఫీజ్ ఎదురు తిరిగేసరికి అక్కి, జుబేర్, తదితరులు అతన్ని కర్రలతో కొట్టారు. తల మీద గట్టిగా కొట్టేసరికి హఫీజ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. హఫీజ్‌ను మౌసీమ్, అతని మిత్రులు ఆస్పత్రికి తీసుకువెడుతుండగా గులామ్ నబీ అనే వ్యక్తి, మరికొందరితో కలిసి అడ్డుకున్నారు. వారిపై దాడి చేసారు. కాసిమ్‌ను బలవంతంగా తమ ఇంట్లోకి లాక్కుపోయారు. ఒక గదిలో నిర్బంధించి కర్రలు, రాడ్‌లతో చితగ్గొట్టారు.
బాధితులు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడి ఇంటిని బలవంతంగా తెరిచి బాధితుణ్ణి రక్షించారు. కసమ్ పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో నిందితుడు బాధితులను మరోసారి బెదిరించాడు. ‘‘ఇవాళ పోలీసులు మిమ్మల్ని రక్షించారు, కానీ ఏదో ఒకరోజు మీరు చస్తారు’’ అని బెదిరించాడు.
మౌసీమ్ పోలీసులకు అబ్దుల్ గనీ, నసీరుద్దీన్, మరో డజను మంది వ్యక్తులు తమపై దాడిని చూసారని తెలియజేసాడు. కాసిమ్, హఫీజ్‌లకు తీవ్రగాయాలవడంతో వారిని మండీ ఖేడాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత నుహ్ మెడికల్ కాలేజీకి, ఆ తర్వాత రోహ్‌తక్‌లోని వైద్యశాలకూ తరలించారు.
బాధితులు కాసిమ్, హఫీజ్ తమపై దాడిచేసినవారు రౌడీలని, ఆరేడేళ్ళ క్రితం వేరేగ్రామం నుంచి తమ గ్రామానికి వచ్చారనీ వెల్లడించారు. ఆ గ్రామంలో కూడా వారిపై హత్య కేసు ఉందని వివరించారు. నిందితులు ఏ కారణం లేకుండానే హఫీజ్‌పై దాడి చేసారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి అక్కి, షకీల్, వకీల్, గులాంనబీ, జుబేర్, అక్రమ్, జహీద్, సాజిద్, అర్షిదా, షారునా అనే వ్యక్తులపై కేసు నమోదు చేసారు. దాడి, హత్యాప్రయత్నం, బెదిరింపుల వంటి నేరాలకు పాల్పడినట్లు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది.