ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. దారిపొడవునా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. ఆలయం వద్ద పవన్ కు సంప్రదాయరీతిలో ఆహ్వానం పలికారు. ఆంజనేయస్వామికి పవన్ మొక్కులు చెల్లించారు. కొండగట్టు క్షేత్రంలోనే కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని వినియోగించారు. ఆ వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించింది.