ఆప్ కీలక నేత, దిల్లీ మంత్రి ఆతిషిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువునష్టం దావా వేశారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ న్యాయస్థానం, జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది.
దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మాట్లాడిన ఆతిషి బీజేపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందన్నారు.
ఆప్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆతిషి ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. ఆ తర్వాత కూడా అతిషి ఆరోపణలు కొనసాగించారు. కొంతమంది సన్నిహితుల ద్వారా బీజేపీ నేతలను తనను సంప్రదించారని చెప్పారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని హెచ్చరించారని, అలా చేయకపోతే ఈడీ అరెస్టు చేస్తుందని బెదిరించారన్నారు. ఆతిషిపై న్యాయపోరాటానికి దిగిన బీజేపీ, పరువు నష్టం దావా కింద నోటీసులు పంపింది.