మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 30మంది ముస్లిములు ఇస్లాం మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి తిరిగివచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ‘సాఝా సంస్కృతి మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ ముస్లిములను స్వధర్మంలోకి తీసుకొచ్చే సంప్రదాయాన్ని పూర్తి చేసింది.
మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ చట్టం 2021 ప్రకారం 14మంది మహిళలు సహా మొత్తం 30 మంది ముస్లిములు సనాతన ధర్మంలోకి వచ్చారు. ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేశ్ ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాఝా సంస్కృతి మంచ్ అధ్యక్షుడు శ్యామ్ పవారీ, ఈ ముస్లిముల పూర్వీకులు హిందువులేననీ, వారు ఇండోర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారనీ తెలియజేసారు.
గణేశుడి మందిరంలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో ఈ ముస్లిములు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఇప్పుడు 58ఏళ్ళ జమీర్ బీ జమునాబాయి అయింది. 34ఏళ్ళ నీలోఫర్ షేక్ పేరు నికితగా మారింది. 34ఏళ్ళ అక్సర్ షేక్ ఇప్పుడు ఆకాంక్షగా మారింది. అలా, మొత్తం 30మంది ముస్లిములు తమ ప్రాచీన సనాతన ధర్మంలోకి మళ్ళీ చేరుకున్నారు.
ఇస్లాంను వదిలిపెట్టి సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్న ముస్లిములు నిజానికి మతం మారడం లేదని, తమ సొంతగూటికి తిరిగివస్తున్నారనీ మాల్వా ప్రాంత విశ్వహిందూపరిషద్ నేత వ్యాఖ్యానించారు. రోహిత్ అనే యువకుడు కొంతకాలం క్రితం ఇస్లాంలోకి మతం మారాడు. ఇప్పుడతను మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చేసాడు. ఇండోర్‌లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ముస్లిములు కూడా ఇప్పుడు సనాతన ధర్మంలోకి అంటే తమ సొంత ఇంటికి తిరిగి వస్తున్నారు.
ఏప్రిల్ 27న ఖజ్రానా గణేశ్ మందిరంలో 9మంది ముస్లిములు ఘర్ వాపసీ అయ్యారు. పవిత్ర గంగాజలాన్ని, గోపంచకాన్నీ స్వీకరించి వారు సనాతన ధర్మంలోకి వచ్చేసారు. వారిలో ఆరుగురు ఇండోర్‌కు చెందినవారు కాగా మరో ముగ్గురు మాదసోర్ ప్రాంతానికి చెందినవారు.
స్వధర్మంలోకి మళ్ళీ వచ్చిన ఈ ముస్లిములు, తాము స్వచ్ఛందంగానే తమ మతాన్ని వదులుకున్నామని జిల్లా అధికారులకు అఫిడవిట్ సమర్పించారు. 28మంది వ్యక్తులు ఇష్టపూర్తిగా హిందూధర్మంలోకి మారినట్లు తమకు సమాచారం వచ్చిందని స్థానిక డిఎస్‌పి వెల్లడించారు. వారిపై ఎవరూ ఒత్తిడి తెచ్చినట్లు గానీ, లేక వారిని ప్రలోభపెట్టినట్టు కానీ ఎలాంటి ఆరోపణలూ లేవన్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2021లో మతస్వేచ్ఛ చట్టం చేసింది. దాని ప్రకారం మోసపూరితంగా లేదా ప్రలోభపెట్టి మతం మార్చడం నేరం. ఆ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా విధిస్తారు.