1999 కార్గిల్ యుద్ధాన్ని తలచుకోగానే గుర్తొచ్చే పేరు టోలోలింగ్. శ్రీనగర్-కార్గిల్-లెహ్ రహదారిలో ఎత్తైన పర్వత ప్రదేశమది. దాన్ని పాకిస్తానీయులు మోసంతో వశం చేసుకున్నారు. దాన్ని వెనక్కి సాధించడం భారతదేశానికి రక్షణ పరంగా కీలకం. దాన్ని తిరిగి సాధించడానికి భారత్ ఎంతో రక్తం చిందించాల్సి వచ్చింది. ఎట్టకేలకు 1999 జూన్ 13 రాత్రి భారత సైన్యం టోలోలింగ్‌ను మళ్ళీ సాధించారు. టోలోలింగ్ కోసం ప్రధానంగా యుద్ధం చేసినవి 2 రాజపుతానా రైఫిల్స్, గ్రెనేడియర్స్ దళాలు.
టోలోలింగ్‌ను స్వాధీనం చేసుకోవడం కార్గిల్ యుద్ధంలో కీలక మలుపు అని, అది పాకిస్తానీ సైన్యపు నైతిక స్థైర్యాన్ని చిత్తుచిత్తు చేసిందనీ భారతీయ కమాండర్లు చెబుతారు. అయితే భారత సైన్యం కూడా భారీగానే నష్టపోయింది. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురికి మహావీర చక్ర, ఇద్దరికి వీర చక్ర పతకాలు దక్కాయంటే ఆ యుద్ధం ఎంత దారుణంగా జరిగిందో అర్ధమవుతుంది. దేశంలో రెండో అత్యున్నత సైనిక పురస్కారం మహావీరచక్ర గెలుచుకున్న వారు మేజర్ రాజేష్ అధికారి, మేజర్ వివేక్ గుప్తా, మేజర్ పద్మపాణి ఆచార్య, హవల్దార్ దిగేంద్ర కుమార్. వారు నలుగురికీ మరణానంతరమే ఆ గౌరవం దక్కడం విశేషం. మరో ఇద్దరు సైనికాధికారులు కల్నల్ రవీంద్రనాథ్, కెప్టెన్ వైజయంత్ థాపర్లకు వీర చక్ర పురస్కారం ప్రదానం దక్కింది.
టోలోలింగ్ యుద్ధం భారత సైనిక బలగాలకు, ‘నార్దరన్ లైట్ ఇన్ఫ్యాంట్రీ’ బెటాలియన్‌కూ జరిగిన కీలక యుద్ధం. ప్రత్యర్ధులు ఎత్తయిన ప్రదేశంలో సురక్షితంగా ఉన్నారు. టోలోలింగ్‌లో పాయింట్ 5140, పాయింట్ 4875 ఉన్న ప్రధాన శిఖరాలు. పాయింట్ 5100, టైగర్ హిల్‌గా పేరొందిన పాయింట్ 5060 అక్కడికి పశ్చిమాన ఉన్నాయి. పాక్ సైన్యాలపై భారత బలగాలు పదేపదే పదేపదే దాడులు చేయడంతో టోలోలింగ్ మొత్తం భారత్ నియంత్రణలోకి వచ్చేసింది. అదే కార్గిల్ వార్ యుద్ధం దిశను, గతిని సమూలంగా మార్చేసింది.
టోలోలింగ్ కోసం చేసిన యుద్ధంలో భారతీయ సైనికులు పెద్దసంఖ్యలో మరణించారు. కార్గిల్ యుద్ధం మొత్తం మీద మరణించినవారిలో, టోలోలింగ్ కోసం పోరాడుతూ చనిపోయినవారే ఎక్కువ. ఆ ప్రాంతం కోసం 1999 మే 22 నుంచి జూన్ 16 వరకూ, అంటే సుమారు నెలరోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ ప్రాంతాన్ని పాకిస్తానీలు ఎంతలా ఆక్రమించుకున్నారంటే దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం భారతీయ సైనికులు వరుసగా 16రోజులు వేచిచూడాల్సి వచ్చింది.
టోలోలింగ్ దగ్గర దాడి సమయానికి భారత సైన్యం గడ్డు పరిస్థితుల్లో ఉంది. సైనికులు కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. అదనపు బులెట్లు, ఇతరత్రా ఆయుధ సంపత్తి కోసం భారతీయ జవాన్లు తమ ‘డ్రై-రేషన్’ను వదులుకోవలసి వచ్చింది. చివరికి ఆ శిఖరం మొత్తాన్నీ భారత్ స్వాధీనం చేసుకునేసరికి కనీసం 50 పాకిస్తానీ కళేబరాలు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారు తమ బంకర్లలో పెద్దమొత్తంలో నెయ్యి, టిన్డ్ అనాస ముక్కలు, వెన్న, తేనె నిల్వ చేసుకున్నారు. ఆ రేషన్ దొరికినప్పుడు, ఆకలిగా ఉన్న సైనికులు తేనెలో వెన్న నంచుకుని తినేసారు. అక్కడ మైనస్ 10 డిగ్రీలు, అంతకంటె తక్కువ ఉష్ణోగ్రతల్లో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోడానికి నెయ్యి వాడుకున్నారు.
రాజపుతానా రైఫిల్స్ దళం దాడి చేసినప్పుడు, ఆ దళంలోని వంటవాడు, వడ్రంగి కూడా సాయపడ్డారు. వడ్రంగి ఉత్తమ్‌సింగ్‌కు రాత్రిపూట ఏమీ కనిపించేది కాదు. అయినా ఆయన తన ముందు నడుస్తున్న మనిషి ఊతంగా ఆయుధాలను కొండపైకి తీసుకు వెళ్ళేవాడు. ఆ యుద్ధంలోనే యువ కెప్టెన్ కెంగురూజ్ ఉత్తి కాళ్ళతో, ఏ చెప్పులూ బూట్లూ లేని కాళ్ళతో, లైట్ మెషిన్ గన్ మోసుకుంటూ ఒక కొండకొమ్మును అధిరోహించి, స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.
యుద్ధక్షేత్రానికి దూర ప్రదేశాల్లోనూ, అంటే వందల కిలోమీటర్ల దూరంలోనూ, టోలోలింగ్ యుద్ధం ఎంతో స్ఫూర్తిని కలగజేసింది. రాజపుతానా రైఫిల్స్ దళంలో మృతుల సంఖ్య పెరిగిపోతోందన్న వార్తలు దూరాన ఉన్న శిక్షణా కేంద్రాలకు చేరాయి. రాజపుతానా రైఫిల్స్‌లో శిక్షణ పొందుతున్న వారిలో కనీసం 3వందల మంది, శత్రువుతో యుద్ధం చేయడానికి తమను కార్గిల్ పంపించమంటూ విజ్ఞప్తులు చేసారంటే, ఆ యుద్ధం వారిలో కలిగించిన స్ఫూర్తిని, ప్రేరణను అర్ధం చేసుకోవచ్చు.