టీ20 ప్రపంచకప్ -2024 టోర్నీ ఆఖరిఘట్టానికి చేరుకుంది. నేటి రాత్రి 8 గంటలకు బార్బడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య అంతిమ సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు వాన ముప్పు ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
నేడు మ్యాచ్ రద్దు అయితే రేపు (ఆదివారం) రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ రేపు కూడా వాన కారణంగా మ్యాచ్ నిలిచిపోతే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.
టీ20ల్లో భారత్-సఫారీ ఇప్పటి వరకు 26సార్లు తలపడ్డాయి. భారత్ 14 సార్లు విజయం సాధించగా సఫారీలు 11మార్లు గెలిచారు. సౌతాఫ్రికాపై భారత్ అత్యధిక స్కోరు 237/3 గా ఉంది. గువాహటిలో2022 అక్టోబర్ 2న జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది.
టీ 20 వరల్డ్‌కప్ టోర్నీలో వస్తే ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ ఇప్పటి వరకు మూడు సార్లు ఫైనల్ కు చేరింది. 2007లో టైటిల్ గెలిచిన భారత్… 2014లో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడింది. దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి.
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కప్పుతో వాళ్లిద్దరూ వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాహుల్ ద్రవిడ్‌కు కూడా భారత కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్. ఆటగాడిగా, కోచ్‌గా ఇప్పటిదాకా ప్రపంచకప్ కలను రాహుల్ నెరవేర్చుకోలేకపోయారు.