పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారంటూ ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ న్యాయపోరాటం చేపట్టారు. మమతా బెనర్జీపై కోల్‌కతా హైకోర్టులో పరువునష్టం వ్యాజ్యం వేశారు.
‘‘ రాజ్‌భవన్‌కు వెళ్ళేందుకు మహిళలు భయపడుతున్నారని’’ ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీఎం హోదాలో మమత తప్పుడు ఆరోపణలు చేశారని ఖండించిన గవర్నర్, తాజాగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజాప్రతినిధులు తప్పుడు అభిప్రాయాలను సృష్టించడం, వ్యాపింపచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో పేర్కొన్నారు. గవర్నర్ ఆనంద్ బోస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా సమర్థించారు. మమతా పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విషయంలో మద్దతు తెలుపుతున్నామన్నారు.
పశ్చిమబెంగాల్ శాసనభలో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార ప్రక్రియలోనూ టీఎంసీ ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
తమ ఎమ్మెల్యేలను సోమవారం సాయంత్రం మూడు గంటలలోపు ప్రమాణస్వీకారం చేయించకపోతే ‘‘అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ హోటల్ తాజ్ ప్యాలెస్’’ రహస్యాన్ని బయటపెట్టాల్సి వస్తుందని తృణమూల్ కాగ్రెస్ నేత కునాల్ ఘోష్ బెదిరించారు. ఈ డెడ్ లైన్ పై స్పందించిన గవర్నర్ ఆనంద్ బోస్ సాయంత్రం నాలుగు గంటల తర్వాత తాను స్పందిస్తానని బదులిచ్చారు.
శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికి అనుమతి నిరాకరించే హక్కు రాష్ట్ర గవర్నర్ సి.వి.ఆనందబోస్‌కు లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కొన్ని కార్యకలాపాల గురించి తనకు ఫిర్యాదులు అందినట్లు ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి ఆరోపణల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్నికై నెల రోజులు గడిచినా తమ ఎమ్మెల్యేలు సయంతిక బెనర్జీ, రయత్ హోసేన్ ప్రమాణస్వీకారం పూర్తి కాలేదన్నారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా రాజ్‌భవన్‌కే ఎందుకు వెళ్లాలి? గవర్నర్ ఆ బాధ్యతను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు ఎందుకు అప్పగించడం లేదని ఆమె ప్రశ్నించారు. స్పీకర్ నే అసెంబ్లీకి రావచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించగా, ఆ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించే బాధ్యతను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే అధికారాన్ని రాజ్యాంగం తనకు అప్పగించిందన్నారు. అసెంబ్లీని వేదికగా ఎమ్మెల్యేల ప్రమాణం చేయించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, స్పీకర్ నుంచి అందిన లేఖలో రాజ్‌భవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అభ్యంతరకర విషయాలు ఉన్నందున ఆ అవకాశం సమంజసంగా అనిపించలేదన్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ బోస్, తనను వేధించినట్లు కాంట్రాక్టు మహిళా ఉద్యోగి ఒకరు మే 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బెంగాల్ పోలీసులు విచారణకు సిద్ధమయ్యారు.