ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టిన గతి శక్తి పథకంపై అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది. దేశంలో పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానించడం, జాతీయ రహదారులను ఆరు వరుసలుగా మార్చడం, పలు జల మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేపట్టిన ప్రధానమంత్రి గతి శక్తి పథకం మంచి ఫలితాలిచ్చిందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధికి 126 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశ ముందన్నారు.
మౌలిక సదుపాయాల వృద్ధికి భారత్ గతంలో జీడీపీలో కేవలం 5.3 శాతం మాత్రమే ఖర్చుపెట్టేదని, గతి శక్తి పథకం అమల్లోకి వచ్చాక జీడీపీలో మౌలిక సదుపాయల రంగం వాటా 6.5 శాతానికి పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ గుర్తుచేసింది. ఇది ఒక రకంగా చైనాలో మౌలిక వసతులపై పెడుతున్న ఖర్చు కన్నా ఎక్కువేనని గుర్తు చేసింది. ఇక దేశంలో ఓడరేవులను జాతీయ రహదారులతో కలిపే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయని కొనియాడింది.
జలమార్గాల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే దేశంలో 220 జలమార్గాలు పూర్తి చేశారని, మరో లక్షా 12 వేల కోట్ల విలువైన 223 పనులు జరుగుతున్నాయని మోర్గాన్ స్టాన్లీ గుర్తుచేసింది. రాబోయే ఐదేళ్లలో ప్రధానమంత్రి గతి శక్తి పథకం దేశంలో మౌలికసదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతోందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో వెల్లడించింది.