ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి టెర్మినల్‌లో పైకప్పు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించారు, 8మంది గాయపడ్డారు. ఆ దుర్ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు.
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రాథమిక పరీక్షలు జరిపిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. అన్ని విమానాశ్రయాల నుంచీ 2-5 రోజుల్లో నివేదికలు అడిగామని చెప్పారు. ఆ నివేదికల ఆధారంగా అటువంటి దుర్ఘటనలు మరెక్కడా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
ప్రమాదం వల్ల ప్రభావితులైన ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడం కోసం వార్‌రూమ్ సిద్ధమైందని చెప్పారు. ప్రయాణికులకు వారి టికెట్ సొమ్ము వారం రోజుల్లోగా రిఫండ్ చేస్తామని, రద్దయిన విమానాలకు బదులుగా ప్రత్యామ్నాయ విమానాల ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనీ మంత్రి చెప్పారు. టెర్మినల్-1లో సేవలను తాత్కాలికంగా 2,3 టెర్మినల్స్‌కు తరలించినట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు.
భారీ వర్షపాతం, ఉధృతమైన గాలుల వల్లనే పైకప్పు కూలిపోయిందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. దుర్ఘటనపై విచారణ జరిపించడానికి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. విమానయాన మంత్రిత్వ శాఖ మృతుడి కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడినవారికి ఒక్కొక్కరికీ రూ.3లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తోంది. విషాదాన్ని రాజకీయం చేస్తోంది. ఆ చర్యలపై మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పైకప్పు కూలిన భవనం 2009 నాటి పాత నిర్మాణమనీ, ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించిన కొత్త టెర్మినల్ కాదనీ మంత్రి స్పష్టంగా తేల్చిచెప్పారు.