ఎలాంటి అనుమతులు లేని మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్ వద్ద అనుమతులు లేకుండా నడుపుతోన్న ఓ మదర్సాలో పదిహేడేళ్ల కరిష్మా శుక్రవారంనాడు అనుమానాస్పదంగా చనిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన కరిష్మా ఏడో తరగతి పూర్తి చేసి, మూడో అరబిక్ కోర్సు చేసేందుకు మదర్సాలో చేరింది. శుక్రవారం కర్మిష్మాకు ఆరోగ్యం బాగాలేదంటూ తల్లిదండ్రులకు నిర్వాహకులు ఫోన్ చేశారు. వారు వచ్చే లోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. కరిష్మా మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కరిష్మా చనిపోయిన తరవాత అధికారులు మదర్సాలోని వంట గదులకు తనిఖీ చేసి నిర్ఘాంత పోయారు. మదర్సా వంటగదిలోని ఫ్రీజర్‌లో వందకిలోల కుళ్లిన పశువుల మాంసం గుర్తించారు. పాడైపోయిన వాటర్ ఫిల్టర్ నుంచి నమూనాలు సేకరించారు. మదర్సాలో 63 మంది బాలికలు చదువుకుంటున్నా, ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.