తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (76) ఈ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్, హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూసారు. డిఎస్ గుండెపోటు కారణంగా చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసారు. తెలంగాణ విభజన తర్వాత 2015లో టి(బి)ఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ధర్మపురి శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేసారు. చిన్నకొడుకు అరవింద్ బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
డిఎస్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌లోని స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ సాయంత్రం నిజామాబాద్‌కు తరలిస్తారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేసారు.