ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఇవాళ వెలగపూడి సచివాలయంలో మీడియా ప్రతినిధులకు శ్వేతపత్రంలోని అంశాలను వివరించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందిగ్థంలో పడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. 2019 జూన్‌లో జగన్‌మోహన్ రెడ్డి సీఎం కాగానే రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం పనులు నిలిపేసినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల వరకు కాంట్రాక్టులు అప్పగించలేదని, పనులు అప్పగించిన 8 నెలలకు వరదలు వచ్చి కాపర్ డ్యాం కొట్టుకుపోయిందన్నారు. కాపర్ డ్యాంలోని గ్యాపులు నింపినా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు.
నిర్మాణ సంస్థలను మార్చడం, నిపుణులైన ఇంజనీర్లను బదిలీ చేయడం, కొత్త సంస్థలకు పనులు అప్పగించినా వారు సకాలంలో మొదలు పెట్టకపోవడంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఇంతటి తీవ్ర నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పనులు ఆప వద్దని అప్పటి ముఖ్యమంత్రికి నిపుణులు సూచించినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్ బండ్ కూడా వరదల్లో కొట్టుకుపోయిందన్నారు. రాక్ ఫిల్ డ్యాం పనులు ఎలా చేపట్టాలనే దానిపై అంతర్జాతీయ నిపుణులను పిలిపిస్తున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాకు తెలిపారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు