‘‘ భంభంభోలే … హరహర మహాదేవ్ ’’ శరణుఘోష మధ్య అమర్నాథ్ యాత్ర తొలి బ్యాచ్ ను జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. భగవతి నగర్ బేస్ క్యాంప్ లోని యాత్రీ నివాస్ నుంచి శుక్రవారం ఉదయం 4,603 మంది భక్తులు పయనం అయ్యారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య భక్తులు ఉత్తర కశ్మీర్ లోని బల్తాల్, దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ నుంచి యాత్ర ప్రారంభమైంది. యాత్రీకులకు శుభాకాంక్షలు తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బాబా అమర్ నాథ్ కృపతో ప్రతీ ఒక్కరి జీవితంలో సుఖం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
52 రోజుల పాటు అమర్నాథుడిని దర్శించుకోవచ్చు. ఇటీవల జమ్మూలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా సాయుధలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లు భక్తుల భద్రత కోసం వినియోగిస్తున్నారు.