మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా మంత్రివర్గ సహచరులే క్షుద్రపూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనతో సంబంధమున్న ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పర్యావరణ సహాయమంత్రిగా ఉన్న షమ్నాజ్ సలీం, ప్రెసిడెంట్ ఆఫీస్ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
షమ్నాజ్ తో మరో ఇద్దరికీ న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీ విధించినట్లు కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. షమ్నాజ్, రమీజ్‌ను ఒక రోజు వ్యవధిలో మంత్రివర్గం నుంచి తప్పించారు.
గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్‌గా ఉన్నప్పుడు షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా పనిచేశారు. క్షుద్రపూజల ఘటనపై మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.