దిల్లీ తడిసి ముద్ద అయింది. రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వాన దంచి కొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ 150 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
1936 తర్వాత జూన్ లో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వానపడటం ఇదే తొలిసారి. 1936 జూన్ 28న సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో 24 గంటల వ్యవధిలో 235.5 మిల్లిమీటర్ల మేర వాన కురిసింది.
నేడు కురిసిన వానకు ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద వాహనాలు నీట మునిగాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా రహదారులపై నీళ్ళు నిలిచాయి. భారీ వర్షం కారణంగా దిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కూలిపోయిన భవనం 2009లో ప్రారంభించినదని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు.