మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పీవీ నాయకత్వం, జ్ఞానం అమోఘమని సోషల్ మీడియా వేదికగా కీర్తించిన నరేంద్ర మోదీ, దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ నర్సింహారావు ఆద్యుడని కొనియాడారు. పీవీ సేవలను గౌరవిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ఎన్డీయే ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
1921లో జూన్ 28న పీవీ జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. లైసెన్స్ రాజ్ విధానానికి తిలోదకాలు పలకడంతో పాటు పారిశ్రామికీకరణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు పునాధివేశారు.
పీవీ పూర్తి పేరు, పాములపర్తి వేంకట నర్సింహరావు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా సేవలందించారు. దక్షిణభారత దేశం నుంచి ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కిన పీవీ, బహుభాషా పండితుడు. బాబ్రీ కట్టడం కూల్చివేత సమయంలో పీవీనే ప్రధానిగా ఉన్నారు. లుక్ ఈస్ట్ విధానంతో పాటు, అణు విధానంలో కీలక మైలురాళ్ళను పీవీ హయాంలోనే భారత్ అధిరోహించింది.
పీవీ 103 వ జయంతి సందర్భంగా భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నివాళులు అర్పించారు. పీవీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ కీలక మలుపు తిరిగిందని ప్రశంసించారు. ప్రధానిగా పీవీ అనుసరించిన ఆర్థిక సరళీకృత విధానం దేశ గతిని మార్చడంతో పాటు వృద్ధి యుగానికి దారితీసిందన్నారు. మధ్య తరగతిని ఉద్ధరించడంతో పాటు బలమైన, దృఢమైన దేశ నిర్మాణానికి పునాదులు పడ్డాయని పీవీ పాలనా కాలాన్ని గుర్తు చేశారు. భారత దేశ పురోగమనంలో పీవీపాత్ర ఎనలేనిదని ప్రశంసించారు.