విజయవాడలో ఓ వ్యాపారి దారుణ హత్య కలకలం రేపింది. కూతురి వెంట పడుతోన్న మణికంఠ అనే యువకుడిని బృందావన్ కాలనీకి చెందిన వ్యాపారి వార్నింగ్ ఇచ్చాడు. అది మనసులో పెట్టుకుని మణికంఠ హత్యకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. బృందావన్ కాలనీ సింధు భవన్ వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రేమ పేరుతో కూతురి వెంట పడుతోన్న మణికంఠ అనే యువకుడికి వ్యాపారి అలా చేయవద్దని పలుమార్లు చెప్పినా వినలేదని తెలుస్తోంది. మణికంఠ ఆగడాలు ఎక్కువ కావడంతో వ్యాపారి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మణికంఠ వ్యాపారిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు దిగిన మణికంఠ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.