ఢిల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. టెర్మినల్ 1లో కొంత భాగం కిందనే ఉన్న కార్లు, టాక్సీలపై కూలింది. ఓ వ్యక్తి అందులో ఇరుక్కుపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
విమానాశ్రయం టెర్మినల్ 1 కూలిపోవడంతో విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. టెర్మినల్ 1లో విమానాల రాకపోకలు నిలిపివేసినట్లు ప్రకటించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపామని, సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేసవి ఎండలకు అల్లాడిన ఢిల్లీ వాసులు తాజా వర్షాలతో చల్లగాలులు పీల్చుకున్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.