ఐసిసి పురుషుల టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 68 పరుగుల ఆధిక్యంతో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.
గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. మ్యాచ్ మొదలయే సమయానికి వర్షం పడే సూచనలు ఉండడంతో ఇంగ్లండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలుపెట్టిన భారత్, ఆరంభంలోనే విరాట్ కోహ్లీ (9), రిషభ్ పంత్ వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ, టూ-డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ జాగ్రత్తగా ఆడి స్కోర్‌బోర్డ్‌ను కదిలించారు. 8వ ఓవర్ తర్వాత వర్షం పడి ఆట కొంత మందగించింది. తర్వాత ధాటిగా ఆడిన రోహిత్ (57), సూర్య (47) కాసేపటికే ఔట్ అయ్యారు. తర్వాత హార్దిక్ పాండ్య 23, రవీంద్ర జడేజా 17, అక్షర్ పటేల్ 10 పరుగులు సాధించారు. శివం దూబే మొదటి బాల్కే డకౌట్ అయ్యాడు. మ్యాచ్ చివర్లో రవీంద్ర జడేజాకు అర్ష్‌దీప్ సింగ్ (1) క్రీజ్‌లో తోడుగా నిలిచాడు. మొత్తం మీద భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, మొదట్లో ధాటిగా బ్యాటింగ్ చేసింది. జోస్ బట్లర్ దూకుడుగా ఆడడంతో ఆ జట్టు మొదటి మూడు ఓవర్లలోనే 26 పరుగులు సాధించగలిగింది. ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బట్లర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఇంక అక్కడినుంచీ ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. ఫిల్ సాల్ట్‌ను (5) జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేసాడు. జానీ బెయిర్‌స్టో (0), మొయిన్ అలీ (8) లను అక్షర్ పెవిలియన్ బాట పట్టించాడు. అతనికి కులదీప్ తోడయ్యేసరికి భారత బౌలింగ్ పదును పెరిగింది. కులదీప్ బౌలింగ్‌లో శామ్ కరన్ (2) హారీ బ్రూక్ (25), క్రిస్ జోర్డాన్ (1) గ్రౌండ్ విడిచిపెట్టారు. లియామ్ లివింగ్స్టన్ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. 21 పరుగులు చేసిన జోఫ్రా ఆర్చర్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బిడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ (2) సూర్యకుమార్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. రీస్ టోప్లే 3 పరుగులతో క్రీజ్‌లో ఒంటరిగా నిలిచాడు. మొత్తంగా ఇంగ్లండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులుకు ఆలౌట్ అయింది.
రెండో సెమీఫైనల్స్ మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2022 టి20 టోర్నీలో సెమీఫైనల్లోనూ భారత్-ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పుడు కూడా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 169 రన్స్ చేస్తే, ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే సాధించింది. ఆనాటి ఓటమికి భారత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
శనివారం రాత్రి 8 గంటలకు కెన్సింగ్టన్ ఓవల్ గ్రౌండ్లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.