అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం ప్రారంభం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ 79 వేల పాయింట్లు, నిఫ్టీ 24వేల పాయింట్లు దాటిపోయాయి. చివరకు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా దిగివచ్చాయి. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగి, 79243 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి, 24,044 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టాటాస్టీల్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ కంపెనీలు లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, నెస్లే నష్టాలను చవిచూశాయి. రూపాయి స్వల్పంగా బలపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర 2323 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.