బిహార్‌లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి సిబిఐ ఇద్దరిని అరెస్ట్ చేసింది. మనీష్‌కుమార్, ఆశుతోష్ అనే ఇద్దరిని పట్నాలో అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టులు చేయడం ఇదే మొదలు.
సిబిఐ వర్గాల కథనం ప్రకారం… మనీష్ కుమార్ తన కారులో విద్యార్ధులను తరలించాడు. కనీసం పాతిక మంది విద్యార్ధులను ఒక ఖాళీ స్కూల్‌కు తీసుకువెళ్ళాడు. అక్కడ వారికి ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి, జవాబులు బట్టీ పట్టించాడు. ఇక ఆశుతోష్ ఆ విద్యార్ధులకు తన ఇంట్లో వసతి కల్పించాడు.
మనీష్, ఆశుతోష్ ఇద్దరినీ సిబిఐ ప్రశ్నించడానికి తమ కార్యాలయానికి పిలిపించింది. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిబిఐ ఆదివారం నుంచి ఇప్పటికి ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 5న నీట్-యుజి ప్రవేశపరీక్ష నిర్వహించింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించింది. అయితే ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఆరోపణలు, 1500 మందికి గ్రేస్ మార్కులు వేసిన ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో ఈ కేసు గురించి ప్రస్తావించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సవ్యమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించడానికి కట్టుబడి ఉన్నామనీ, దోషులను కఠినంగా శిక్షిస్తామనీ చెప్పారు. పరీక్షల ప్రక్రియను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.