భారత్ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ఆకాంక్ష
భారత్ త్వరలో ప్రపంచలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. గత పదేళ్ళలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పటివరకు రూ.3.20లక్షల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రాధమ్యాలను వివరించారు.
తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మకు ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు.
ప్రసంగంలో తొలుత 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయని కితాబిచ్చారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీని అభినందించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఎంపీలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు.సంస్కరణలు, పనితీరు, మార్పు ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టిన రాష్ట్రపతి , కశ్మీర్ లోయలో ఈ దఫా మార్పు కన్పించిందన్నారు. శత్రువుల కుట్రలకు కశ్మీరులు గట్టిగా బదులిచ్చారన్నారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం మంచిపరిణామమని కొనియాడారు.
ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆయుష్మాన్ భారత అనేది గేమ్ ఛేంజర్‌గా నిలువనుందని ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. నారీమణుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు.
ప్రపంచ వృద్ధిలో భారత్ 15శాతం భాగస్వామ్యం అవుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోందన్నారు. పౌర విమానయాన రంగంలో అనేక మార్పులు తీసుకురావడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశామన్నారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయన్నారు.