ఈవీఎం ధ్వంసం, కారంపూడి సీఐ సుధాకర్‌పై హత్యాయత్నం సహా, 14 కేసులు ఎదుర్కొంటోన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని జడ్జి ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు తరలించారు. మధ్యంతర బెయిల్ కావాలంటూ పిన్నెల్లి ఏపీ హైకోర్టులో వేసిన నాలుగు పిటిషన్లు బుధవారం కొట్టేయడంతో, వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం, గట్టి బందోబస్తు మధ్య మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిశారు. న్యాయమూర్తి పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించారు.
బుధవారం అర్థరాత్రి మాచర్ల జడ్జి తీర్పు మేరకు పిన్నెల్లిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. 8 పోలీసుల వాహనాల భద్రతతో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించారు. పిన్నెల్లిపై పోలీసులు ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు. ఇదే కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.