లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.
ఆ వెంటనే సభలో ఆందోళనలు మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఓం బిర్లా, ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి ప్రస్తావించారు. ఆ ఘటన బాధితులకు నివాళిగా రెండు నిమిషాల మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. దానికి ప్రతిపక్షం నిరసన తెలియజేసింది.
మూజువాణి ఓటుతో ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యాక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన దగ్గరకు వెళ్ళి అభినందించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చేతులు కలిపారు. వారిద్దరూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజుతో కలిసి ఓం బిర్లాను స్పీకర్ చైర్ వద్దకు తీసుకువెళ్ళారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధానమంత్రి, ప్రతిపక్షాల నాయకులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ‘సభను ఎంత సమర్ధంగా నడిపారన్నది కాదు, దేశం గొంతుకను ఎంత విననిచ్చారన్నది ప్రధానం. ప్రతిపక్షాల గొంతులు నొక్కేసి సభను సమర్ధంగా నడిపామనుకుంటే అది అప్రజాస్వామికం అవుతుంది’ అంటూ ఓం బిర్లాను హెచ్చరించారు.
ఓం బిర్లా స్పీకర్ బాధ్యతలు స్వీకరించాక సభను ఉద్దేశించి మాట్లాడుతూ సభామర్యాదను కాపాడాలని ఎంపీలకు విజ్ఞప్తి చేసారు. వీధుల్లో నిరసనలకు, సభలో నిరసనలకు తేడా ఉండాలని హితవు పలికారు. ఆ తర్వాత ‘ఎమర్జెన్సీ చీకటి రోజులకు’ 50ఏళ్ళు నిండిన సందర్భంగా రెండు నిమిషాల మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. దానికి ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది.
ఎమర్జెన్సీ 50ఏళ్ళ సందర్భాన్ని స్పీకర్ ప్రస్తావించడాన్ని బిజెపి సమర్థించింది. ‘అన్ని చారిత్రక సంఘటనల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం మన సామూహిక కర్తవ్యం. యువతరం ప్రజాస్వామ్యం గురించి తెలుసుకున్నప్పుడే రాజ్యాంగం పట్ల చైతన్యం బలపడుతుంది’ అని బిజెపి వర్గాలు వ్యాఖ్యానించాయి.
ఎమర్జెన్సీ గురించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ‘దురదృష్టకరం’ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. ‘‘అసలు ఆ ప్రస్తావనే అనవసరం. అదెప్పుడో 49ఏళ్ళ క్రితం జరిగిపోయింది. పరస్పర సహకారం, ఏకాభిప్రాయం గురించిన సందేశం అందరికీ అందాల్సిన ఈ రోజు అలాంటి సందర్భం గురించి అంత సుదీర్ఘంగా వివరంగా మాట్లాడడం దురదృష్టకరం’’ అన్నారు. ఒకపక్క ఏకాభిప్రాయం సాధించాల్సిన స్ఫూర్తి గురించి మాట్లాడుతూ మరోవైపు జనాల్లో విభజన తెచ్చే ప్రకటన చేసారంటూ స్పీకర్‌ను విమర్శించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగడం ఇది కేవలం మూడోసారి. సాధారణంగా స్పీకర్ విషయంలో పాలక, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు పట్టడంతో, సంఖ్యాపరంగా ఎన్‌డిఎ అభ్యర్ధికే ఆధిక్యం ఉన్నప్పటికీ, ఎన్నిక అనివార్యమైంది. ఓం బిర్లాకు 297మంది ఎంపీలు ఓటు వేయగా, కాంగ్రెస్ అభ్యర్ధి కె సురేష్‌కు 232 మంది ఎంపీలు ఓటు వేసారు.