మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు పలువురి పై దాడి, దుర్భాషలాడిన కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
పిన్నెల్లిని మాచర్ల ఎస్పీ కార్యాలయానికి తరలించిన పోలీసులు అక్కడి నుంచి కోర్టుకు తరలించే అవకాశముంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ఎన్నికల రోజు పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈవీఎం ధ్వంసం సందర్భంగా ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలింగ్ తర్వాతి రోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో దాడులకు దిగారని, సీఐపై దాడి చేసి గాయపరిచినట్లు కూడా కేసు నమోదైంది.
ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి న్యాయస్థానంలో నాలుగు పిటీషన్లు దాఖలు చేయగా జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగిశాయి. నేడు తీర్పు వెలువడింది. బెయిల్ పిటీషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించగా ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున అడ్వకేట్ పోసాని వెంకటేశ్వర్లు వాదించారు.