విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాటలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుం కట్టింది. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను తయారుచేసింది. కేంద్రప్రభుత్వానికి స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తు గురించి ఒక వినతిపత్రం సమర్పించింది.
బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో ఢిల్లీలో ఇవాళ సమావేశమైంది. గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపినట్లు కుమారస్వామి బిజెపి నేతలకు వివరించారు. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే ఉద్యమం నుండి వచ్చిన భారీ పరిశ్రమ స్టీల్ ప్లాంట్ అనీ, అది ఆంధ్రుల సెంటిమెంట్ కాబట్టి గౌరవించాలనీ ఏపీ బీజేపీ నేతలు కేంద్రమంత్రిని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ను సమర్ధంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తెచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలని కోరుతూ ఏపీ బీజేపీ బృందం కుమారస్వామితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అన్ని ప్రయత్నాలూ చేయాలని కోరారు. కుమారస్వామి సానుకూలంగా స్పందిస్తూ, అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపాక ఇదేవిషయంపై రెండుమాసాల్లో మరోసారి సమావేశమవుదామని పురందరేశ్వరికి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి బిజెపి ఎంపి సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధరాజు పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్ గురించి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు.