తమిళనాడులోని తిరువారూరు జిల్లా మన్నార్‌గుడి చేరువలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా జూన్ 23న ఒక అరుదైన విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అది లోహవిగ్రహం కావడం విశేషం.
నటరాజన్ అనే వ్యక్తి తన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. అందులో భాగంగా ఒక గొయ్యి తవ్విస్తున్నప్పుడు అక్కడ లోహ విగ్రహం బైటపడింది. ఆ విషయాన్ని పోలీసులకు, జిల్లా కలెక్టర్‌కు తెలియజేసారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, పోలీస్ ఇనస్పెక్టర్ వేలాయుధం ఆ స్థలానికి వెళ్ళి విగ్రహాన్ని పరిశీలించారు. అది పెరుమాళ్ అనబడే విష్ణుమూర్తి విగ్రహం అని నిర్ధారించారు. దాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు.
పెరుమాళ్ విగ్రహం ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. సుమారు 5 కిలోగ్రాముల బరువు ఉంది. పెరుమాళ్ మూర్తి చుట్టూ తోరణం లాంటి నిర్మాణం (తిరువచ్చి) ఉంది. ప్రాథమిక పరీక్షల అనంతరం అది చోళుల తర్వాతి కాలానికి చెందినది అయి ఉంటుందని భావిస్తున్నారు. సుమారుగా 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహం అయి ఉండొచ్చని అంచనా వేసారు.
ఈ విగ్రహం దొరికిన స్థలం ప్రాచీన గోపియార్ కోలప్రళయం మహర్షి ఆలయానికి చేరువలో ఉంది. దాంతో ఆ ప్రాంతానికి సనాతనధర్మపరంగా ఉన్న ప్రాధాన్యతకు మరో నిదర్శనం లభించినట్లయింది. ఆ విగ్రహం గురించి మరిన్ని వివరాలను, దాని చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోడానికి పురావస్తు శాఖ ఆ ప్రాంతంలో పరిశోధనలు చేయనుంది. అంతేకాదు, ఆ ప్రదేశానికి దగ్గరలోనే వెయ్యేళ్ళ ప్రాచీనమైన రాజగోపాలస్వామి దేవాలయంలో కొన్నాళ్ళుగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అలాంటి చోట పెరుమాళ్ పురాతన పంచలోహ విగ్రహం బైటపడడం భక్తులకు ఆనందోత్సాహాలు కలగజేస్తోంది.
తిరువారూరు జిల్లాలో ఇటువంటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిధులు లభించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల పాపనాశం క్షేత్రానికి చేరువలో కోలిరాయన్‌పేట్టై గ్రామంలో చోళుల కాలానికి చెందిన పలు పంచలోహ విగ్రహాలు, ఇతర కళాఖండాలూ లభించాయి. ఈ యేడాది ఏప్రిల్ నెలలో ఇదే జిల్లాలోని పెరుమాళకరం గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా రామచంద్రమూర్తి ప్రాచీన విగ్రహం లభించింది.
తిరువారూరు ఒకప్పుడు తంజావూరు జిల్లాలో భాగం. చోళుల రాజ్యంలో ప్రధానమైన ప్రాంతం. దక్షిణాది ధాన్యాగారం అనే పేరు కూడా ఉంది. పురావస్తువుల పరంగా, సాంస్కృతిక వారసత్వం పరంగా ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది.