ఛత్తీస్‌గఢ్ పోలీసులు మంగళవారం నాడు నలుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసారు. మోహ్లా మన్పూర్ అంబాగఢ్ చౌకీ జిల్లాలో వామపక్ష ఉగ్రవాదులకు ఆదాయ సంపాదనకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులను నిర్బంధించారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… మంగళవారం మదన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరెకట్ట గ్రామంలో నలుగురిని అరెస్ట్ చేసారు. అరవింద్ తులావీ ఆ గ్రామానికి చెందిన వ్యక్తి. మహేష్ మేస్రాం ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి. రామకృష్ణ యాదవ్ స్థానిక కాంట్రాక్టర్, సుశీల్ సాహు రాజనంద్‌గావ్‌లో ఒక ట్రాక్టర్ షోరూమ్‌లో ఉద్యోగి. వాళ్ళు నలుగురూ, మావోయిస్టులకు సాయం చేయడానికి ఏర్పడిన సిండికేట్‌లో సభ్యులు. రామకృష్ణ యాదవ్ మావోయిస్టుల కోసం ట్రాక్టర్ కొనడానికి డబ్బులు అందజేసాడు. ఆ ట్రాక్టర్‌ను అద్దెకు తిప్పడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మావోయిస్టులకు ఇచ్చేవారు.
రామకృష్ణ యాదవ్ ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు కాంట్రాక్టులు చేసేవాడు. అతను చేపట్టిన ఒక నిర్మాణ కాంట్రాక్టులో ఒక వాహనాన్ని మావోయిస్టులు నిప్పుపెట్టి తగలబెట్టేసారు. దాంతో భయపడిన యాదవ్, తన పనులకు మావోయిస్టులు అడ్డం రాకుండా ఉండడానికి వారికి ‘లెవీ మనీ’గా రూ.7.5 లక్షలు సమకూర్చాడు. ఆ డబ్బును సుశీల్ సాహుకు అందజేసాడు.
సుశీల్ సాహు నకిలీ పత్రాలు సమర్పించి, మావోయిస్టుల కోసం ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసాడు. అతను గ్రామంలోని ఒక వ్యక్తి దగ్గర బ్యాంకు ఖాతా తెరవడం కోసం అని చెప్పి డాక్యుమెంట్లు సంపాదించాడు. మహేష్ మేస్రాం సహాయంతో ఆ పత్రాలతో ట్రాక్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసాడు. ఆ ట్రాక్టర్‌ను అరవింద్ తులావీ నడుపుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ విధంగా వచ్చిన ఆదాయాన్ని వారు మావోయిస్టులకు అందజేస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ నలుగురినీ అరెస్ట్ చేసారు. నిందితులపై కేసు నమోదు చేసారు. సంబంధిత డాక్యుమెంట్లు, ట్రాక్టర్ సీజ్ చేసారు.
ఇటీవల మావోయిస్టులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. భద్రతా బలగాలు వారి ఆదాయ మార్గాలను సమర్థంగా అడ్డుకుంటున్నాయి. దాంతో వారు కొత్తకొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. తమ ప్రాబల్యం ఉన్న చోట్ల పనిచేస్తున్న కాంట్రాక్టర్లు, వ్యాపారులు, కంపెనీలను బెదిరించి ‘లెవీ మనీ’ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈమధ్య అక్రమ గనితవ్వకాలు, నిషిద్ధ పదార్ధాల సాగు వంటి మార్గాల్లోనూ ఆదాయం పెంచుకుంటున్నారు. ఈ మధ్యనే మావోయిస్టులు దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేస్తున్న సంఘటన సైతం వెలుగు చూసింది. 50, 100, 200, 500 రూపాయల దొంగనోట్లను గత రెండేళ్ళుగా ముద్రిస్తున్నట్లు వెల్లడైంది. ప్రతీ ఏరియా కమిటీలోనూ కనీసం ఒకరికి దొంగనోట్ల ముద్రణలో శిక్షణ కూడా ఇప్పించారని తెలిసింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు