రాజకీయ జోక్యం కోసం ప్రయత్నాలు
వైసీపీ సానుభూతిపరులుగా ముద్రవేయడంపై అభ్యంతరం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చర్యలను ఎన్డీయేప్రభుత్వం ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఈవో రద్దు చేసిన కొన్ని సౌకర్యాలను పునరుద్ధరించిన ప్రస్తుత ఈవో, సంస్థాగత విషయాలపై వరుస సమీక్షలు చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిదే సహించేది లేదని ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు.
హాకర్ల విషయంలోనూ టీటీడీ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న హాకర్లపై చర్యలకు ఉపక్రమించారు. గడిచిన 30 ఏళ్ళుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా హాకర్లు గా ఉన్న వారిపై టీటీడీ ఉన్నంటుండి చర్యలకు ఉపక్రమించడంతో తిరుమలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ నిర్ణయంతో దాదాపు 150 కుటుంబాలపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం పడనుంది.
టీటీడీ నిర్ణయం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని వైఎస్సాఆర్ సీపీ నేతలు ఆరోపిస్తునారు. లైసెన్స్ లు పునరుద్ధరించుకోని వారిలో ఎక్కువ మంది వైఎస్సాఆర్ సీపీ మద్దతు దారులేనని తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు చెబుతున్నారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే టీటీడీ చర్యలు చేపట్టడంపై హాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలతో సంబంధమున్న స్థానికులే ఎక్కువ మంది విక్రేతలే ఈ చర్యతో ఇబ్బందిపడుతున్నారని చెబుతున్నారు.
‘‘ నేను గత 20 ఏళ్ళుగా స్టాల్ ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. గతంలో నా తండ్రికి దుకాణం కేటాయించారు. ఆయన 19 ఏళ్ళ కిందట చనిపోయారు. అప్పటి నుంచి నేనే స్టాల్ ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. లైసెన్స్ ను నా పేరిట బదిలీ చేసి పునరుద్ధరించమని పలుసార్లు విన్నవించాను. కానీ టీటీడీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, దుకాణాన్ని నడుపుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పారని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలకు ఉపక్రమించడం సరికాదు’’ అని ఓ దుకాణదారుడు తన ఆవేదన వెలిబుచ్చాడు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ పాలకమండలి, కొన్ని చర్యలు చేపట్టింది. తిరుమలలోని స్టాళ్ళ లైసెన్స్ పునరుద్ధరణ, పేరు మార్పు, నివాసాల బదలాయింపు చేపట్టింది. ఈ తరహా కేసులను 90 శాతం వరకు పరిష్కరించింది. కానీ 151 హాకర్ల లైసెన్స్ ను మాత్రం రెన్యువల్ చేయలేదు. వారు 1990 నుంచి రుసుం చెల్లించకపోవడంతో పాటు తగిన నిబంధనలు పాటించకపోవడంతో వాటి రెన్యువల్ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది.
బకాయి రుసుం చెల్లిస్తే స్టాళ్ళను ప్రస్తుత అనుభవ లబ్ధిదారుల పేరిట క్రమబద్ధీకరించాలని గత పాలకమండలి తీర్మానించింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియకు అడ్డంకి ఏర్పడింది. వైఎస్సాఆర్ సీపీ మద్దతుదారులుగా ఉంటూ రుసుం ఎగవేశారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ నిలిచిపోయింది.
లైసెన్స్ రుసుం బకాయిలు వసూలు చేస్తే టీడీపీకి రూ.10 కోట్ల నుంచి 11 కోట్ల ఆదాయం వస్తుందనే వాదన కూడా ఉంది. వివాదాస్పదంగా ఉన్న హాకర్ల లైసెన్స్ రెన్యువల్ చేయడం ద్వారా ఏడాదికి రూ. 54 లక్షల నుంచి రూ. 72 లక్షల అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. అయితే ఈ విషయంలో తమపై ఒత్తిడి ఉందని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు.
తాము ఏ ఒక్క రాజకీయ పార్టీకో మద్దతుదారులుగా లేమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో వైసీపీ, టీడీపీ మద్దతు దారులు ఇద్దరూ ఉన్నారని వివరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యం తమ జీవనాధారం ఇదేనని చెబుతున్నారు. రాజకీయాలపేరిట తమ పొట్టకొట్టవద్దు అని వేడుకుంటున్నారు.
హాకర్లు తొలగించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయడంతో దుకాణదారులంతా కలిసి రాష్ట్రప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు తమ సమస్యను మొరపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు.