లోక్సభ సభాపతిగా గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం జరిగిన పోటీలో ఇండీ కూటమి అభ్యర్థి సురేశ్ పై ఓం బిర్లా నెగ్గారు. ఓం బిర్లా స్పీకర్ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. 17 వ లోక్ సభకు కూడా ఆయనే స్పీకర్ గా వ్యవహరించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ళలో ఇదే ఇదే తొలిసారి.
సభాపతి పదవి విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరిగింది. బుధవారం లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టగా కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. ఇండీ కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానించగా పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు.
మూజువాణీ విధానంలో ఓటింగ్ జరిగింది. ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోడ్కొని రాగా ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు.
ఓం బిర్లా వయస్సు 61 ఏళ్ళు. రాజస్థాన్లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86 శాతం హాజరు నమోదు చేసుకోవడంతో పాటు 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక స్పీకర్గా ఎన్నికయ్యారు.