అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి వాననీరు లీకైందన్న ఆరోపణలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్రమిశ్రా తిరస్కరించారు. ‘ఆలయంలోకి నీరు లీక్ అవలేదు. కరెంటు వైర్ల కోసం పెట్టిన పైపులలోనుంచి వాన నీరు లోపలికి కారిందంతే’ అని వివరించారు.
‘‘నేను స్వయంగా ఆలయ నిర్మాణాన్ని తనిఖీ చేసాను. రెండో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ అంతస్తు కప్పు నిర్మాణం పూర్తయ్యాక గుడిలోపలికి వాననీరు రాదు’’ అని నృపేంద్ర మిశ్రా చెప్పుకొచ్చారు.
ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ సోమవారం ఆరోపించారు. వాననీరు బైటకు పోవడానికి ఏర్పాట్లు లేవన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక అయోధ్యలో కురిసిన భారీ వర్షానికి గుడిలోపల వాననీరు జమ అయ్యింది. అటువంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సత్యేంద్రదాస్ కోరారు. గర్భగుడి పైకప్పు మీద నుంచి నీరు భారీగా లీక్ అయిందని, ప్రధాన పూజారి ఉండే చోట, వీఐపీ అతిథులు దర్శనం చేసుకునే స్థలంలోనూ నీరు లీకయిందంటూ సత్యేంద్రదాస్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ‘‘దేశం నలుమూలల నుంచీ వచ్చిన ఇంజనీర్లు గుడిని కట్టారు. కానీ వాన పడితే పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుందని వారెవరికీ తెలియలేదు. ఎంత ఆశ్చర్యం?’’ అన్నారు.
నృపేంద్ర మిశ్రా, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేసారు. రెండవ, మూడవ అంతస్తులు ఇంకా కట్టవలసి ఉందన్నారు. ఎండా వానా నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు పైకప్పు మీద తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ యేడాది డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తిగా ముగుస్తుందని మిశ్రా ఆశాభావం వ్యక్తం చేసారు.