దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టులో నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుండగా లిక్కర్ స్కామ్ లో భాగంగా మంగళవారం కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది.
జైల్లోనే కేజ్రీవాల్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. నేడు ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్నారు. సుప్రీంకోర్టులో నేడు బెయిల్ దొరుకుతుందనే ఊహాగానాల నడుమ సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తప్పుబట్టారు.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను ఈడీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో పిటిషన్ ను విచారించిన దిల్లీ హైకోర్టు ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది. బెయిల్ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.