ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పై పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం సందర్భంగా ఇతర దేశానికి జై కొట్టినందుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. నిన్న(జూన్25) లోక్సభలో ఎంపీగా ఉర్దూలో అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణస్వీకార వేదికపై నుంచి జై తెలంగాణ, జై భీం, జై మీమ్, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. జై పాలస్తీనా అంటూ ఒవైసీ చేసిన నినాదాలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశానికి భారత లోక్ సభలో జై కొట్టడమేంటని తూర్పారబడుతున్నారు.
ఒవైసీ నినాదాలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రొటెం స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. పాలస్తీనాలో ప్రజలు అణచివేతకు గురవుతున్నందునే తాను ఆ దేశానికి జైకొట్టానని ఒవైసీ సమర్థించుకుంటున్నారు.