భారత లోక్‌సభ చరిత్రలో అరుదైన ఘట్టం ఇవాళ జరగబోతోంది. లోక్‌సభ స్పీకర్ పదవి కోసం 48 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగబోతోంది. ఎన్డీయే ఓంబిర్లాను స్పీకర్ పదవికి ప్రతిపాదించగా, ఇండీ కూటమి కాంగ్రెస్ ఎంపీ అయిన కె సురేష్‌ను నిలబెట్టింది. దాంతో ఎన్నిక అనివార్యమైంది.
ఓం బిర్లా బీజేపీ నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గత పార్లమెంటులో సైతం ఆయనే స్పీకర్‌గా ఉన్నారు. ఆయనను కొనసాగించాలని ఎన్డీయే భావిస్తోంది. అయితే ఆయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ సురేష్‌ను తెర మీదకు తీసుకొచ్చింది. సురేష్ ఇప్పుడు ఎనిమిదోసారి ఎంపీగా ఉన్నారు.
స్పీకర్ ఎన్నికకు సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఓటింగ్ సమయంలో పార్లమెంటులో ఉన్న ఎంపీల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. ఇంకా ఏడుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి వారిని స్పీకర్ ఎన్నికలో పరిగణనలోకి తీసుకోరు.
ఎన్డీయేకు 293మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్‌సిపికి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయే అభ్యర్ధికే మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇండీ కూటమికి 232మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు.
కె సురేష్‌కు ప్రోటెం స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని ఇండీ కూటమి భావించింది. కానీ ఎన్డీయే తిరస్కరించింది. డిప్యూటీ స్పీకర్ పదవి గురించి అసలు పరిగణనే చేయలేదు.
స్పీకర్ పదవికి పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదట అంగీకరించలేదు. అసలు తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని వాదించింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్‌కు మద్దతు ప్రకటించింది.
సంఖ్యాబలం ఎన్డీయే అభ్యర్ధికే ఎక్కువ ఉన్నందున ఎన్నిక లాంఛనప్రాయంగా పూర్తయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఎన్డీయే ఎలాంటి అవకాశమూ తీసుకోదలచుకోలేదు.