1975 జూన్ 25 రాత్రి. భారతదేశపు రాజకీయ చరిత్రలో మరపురాని, మరువలేని రాత్రి. కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అప్పటి రాష్ట్రపతికి ఒక లేఖ పంపించారు. దానితోపాటు అంతర్గత అత్యవసర పరిస్థితి (ఇంటర్నల్ ఎమర్జెన్సీ) ప్రకటన ముసాయిదా ప్రతి కూడా ఉంది.
ఆ లేఖలో, రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చిన అసాధారణ అధికారాన్ని ఉపయోగించి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రయోగించాలని, ఇందిరా గాంధీ కోరారు. ‘‘ప్రియమైన రాష్ట్రపతిగారూ, కొద్దిసేపటిక్రితం మీకు వివరించినట్లు, మాకు అందిన సమాచారం ద్వారా అంతర్గత ఆందోళనల వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచివుందని అర్ధమవుతోంది. ఈ విషయం చాలా జరూరు వ్యవహారం.’’ ఎమర్జెన్సీ ప్రయోగానికి క్యాబినెట్ అనుమతి తీసుకోవాలన్న సాధారణ పద్ధతిని అనుసరించడానికి తగినంత సమయం ఆ రాత్రి లేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ‘‘రేపు తెల్లవారగానే నేను చేసే మొట్టమొదటి పని, ఈ విషయాన్ని మంత్రివర్గానికి తెలియజేయడమే’’ అని ఆ లేఖలో రాసారు.
పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన భారత ప్రభుత్వ వ్యవహారాల నియమ నిబంధనలు, 1961ను ఇందిరా గాంధీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమర్జెన్సీ విధించాలంటే మంత్రివర్గం అనుమతి తీసుకోవాల్సినప్పటికీ ఆమె ఆ నియమాన్ని పాటించలేదు. అసలు, రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చేంత తలబిరుసుతనాన్ని ప్రదర్శించారు. ‘‘ఎంత ఆలస్యమైనా సరే, మీరు ఆ ప్రకటన ఈ రాత్రే చేసి తీరాలని నేను సిఫారసు చేస్తున్నాను’’ అని ఆ లేఖలో ఇందిరా గాంధీ స్పష్టం చేసారు.
ఇందిరా గాంధీ విధేయుడైన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆ లేఖతో పాటు జత పరిచిన అధికార ప్రకటన ముసాయిదా ప్రతి మీద నేరుగా సంతకం చేసేసారు. ఎన్నికల్లో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన తీరుకు నిదర్శనం ఆ సంఘటన.
ఇందిర నుంచి లేఖ అందిన కొద్ది క్షణాలలోనే రాష్ట్రపతి సంతకం పెట్టి స్టాంప్ వేసిన ‘‘ఎమర్జెన్సీ అధికారిక ప్రకటన’’ వెలువడింది. ‘అంతర్గత ఆందోళనల ముప్పు కారణంగా దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న అత్యవసర పరిస్థితి దేశంలో నెలకొని ఉంది’ అనే కారణం చూపి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ‘అంతర్గత ఆందోళనల’ వివరాలేమీ ఆ ప్రకటనలో వెల్లడించలేదు. అంతకుముందు 1962లోనూ, 1971లోనూ విదేశీ శక్తుల చొరబాట్ల కారణంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నందున అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కానీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటనకు కారణమేంటి అన్నది ఎవరికీ తెలీదు.
ఇందిరా గాంధీ మంత్రివర్గం తమ ముందస్తు అనుమతి లేకుండా ముందురోజు రాత్రి జారీ చేసిన అధికారిక ఉత్తర్వుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఆ మరునాడు ఉదయం ఆమోదించింది. ఆ విధానమే ‘కిచెన్ క్యాబినెట్’ అనే పదాన్ని దేశంలో అందరికీ ఊతపదంగా అలవాటు చేసింది. ఇందిర మంత్రివర్గ సభ్యులు తమ రాజకీయ పరిస్థితి గురించి మాత్రమే ఆందోళన చెందారు. తమ అధికారం కొనసాగుతుందా లేదా అని మాత్రమే భయపడ్డారు. భారతదేశ చరిత్రలో రాజ్యాంగాన్ని అంతలా చిత్రవధ చేసిన సంఘటన మరొకటి లేదనే చెప్పవచ్చు. ఇందిర తన నియంతృత్వాన్ని ముందుకు నడపడానికి రాజ్యాంగాన్నే ఒక పనిముట్టుగా వాడుకున్నారు. అందుకే కొందరు ఆమె పాలనను రాజ్యాంగబద్ధ నియంతృత్వం అనేవారు.
రాజ్యాంగంపై క్రూరత్వాన్ని మొదలుపెట్టింది నెహ్రూ
రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఇందిరాగాంధీ సొంత తప్పు కాదు. దానికి ఆమెకు ప్రేరణ తన తండ్రే. అసలు రాజ్యాంగాన్ని మార్చేయడం అన్న దరిద్రగొట్టు పద్ధతిని మొదలుపెట్టింది ఆయనే. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి రెండేళ్ళయినా గడవక ముందే 1951 జూన్ 18న రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేసింది పండిత జవాహర్లాల్ నెహ్రూయే.
దేశ విభజన తర్వాత భారత్‌లోకి వస్తున్న శరణార్థులను ఆదుకోవడంలో దేశీయ ప్రభుత్వం వైఫల్యాలను ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ నిరంతరాయంగా ఎండగడుతూండడం నెహ్రూను చాలా చిరాకు పెట్టింది. ‘‘రాజ్యాంగానికి మొదటి సవరణకు లక్ష్యాలూ కారణాలూ 15 నెలల పాటు రాజ్యాంగంతో పని చేసిన అనుభవమే. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ ఎలా ఉన్నాయంటే ఒక వ్యక్తి హత్య లేదా హింసను ప్రధానంగా ప్రవచించినా అతన్ని నేరస్తుడిగా దోషిగా చూడకూడదు. అందుకే ఆ హక్కుకు సహేతుకమైన ఆంక్షలు ఉండాలి’’ అన్నాడాయన.
నెహ్రూ అనవసర జోక్యం వల్లనే రాజ్యాంగంలో 370వ అధికరణాన్ని చేర్చారు. తద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. దేశానికి తల మీద నిప్పుల కుంపటి పెట్టారు. 1960లో బెంగాల్‌లోని బెరుబరి ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)కు అప్పగించేసేందుకు నెహ్రూ భారత రాజ్యాంగానికి 19వ సవరణ చేసారు. నిజానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా నెహ్రూ వెనక్కి తగ్గలేదు. రాజ్యాంగాన్ని సవరించేసి మరీ ఆ భాగాన్ని భారత్ నుంచి విడదీసేసారు. 1974లో ఇందిరా గాంధీ హయాంలో కచ్చత్తీవు దీవిని శ్రీలంకకు అలాగే బదలాయించేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పలు నల్లచట్టాలను చేసాయి, దేశపౌరుల స్వాతంత్ర్యాన్ని లాగేసుకున్నాయి, ఆ చర్యలను వ్యతిరేకించిన వారిని అణచివేసాయి. నెహ్రూ అలాంటి ఒక అణచివేత చట్టాన్ని తయారుచేసాడు. కలోనియల్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 తరహాలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ 1962 రూపొందించాడు. దాన్ని 1967లో ఉపసంహరించారు. మళ్ళీ 1971లో ఇందిరాగాంధీ ఆ నియమావళిని పునరుద్ధరించింది. దాన్ని కొద్దిగా మార్చి డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ 1971గా మార్చింది. 1971లో ఇందిరా గాంధీ అత్యంత క్రూరమైన మీసా (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) చట్టాన్ని తీసుకొచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణచివేయడానికి మీసా చట్టాన్ని బ్రహ్మాస్త్రంలా ఉపయోగించింది. మీసా, డిసిర్, కొఫెపొసా వంటి చట్టాలు రాజకీయ కార్యకర్తలను వేధించడానికి విస్తృతంగా వినియోగించింది.
న్యాయవ్యవస్థతో తీవ్రమైన విభేదాలు
కాంగ్రెస్ ప్రభుత్వాలు మూడింట రెండువంతుల మెజారిటీని ఒక ఆయుధంగా వాడుకునేవి. న్యాయస్థానాలు జారీ చేసిన చారిత్రక తీర్పులను తిరగరాయడానికి రాజ్యాంగాన్ని వాడుకునే వెసులుబాటు కోసం ఆ మెజారిటీని ఉపయోగించుకునేవి. 1967 గోలక్‌నాథ్ కేసులో, ప్రాథమిక హక్కుల వంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలను పార్లమెంటు సవరించలేదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1971లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికైన వెంటనే రాజ్యాంగానికి 24వ సరవణ చేసి గోలక్‌నాథ్ కేసులో తీర్పును రద్దు చేసింది. సంస్థానాలను రద్దు చేసినప్పుడు సంస్థానాధీశులకు ఇస్తామన్న భరణాలను (ప్రీవీ పర్స్) రద్దు చేస్తామంటూ ప్రభుత్వం కోర్టులో కేసు వేసి ఓడిపోయింది. రాజభరణాల రద్దు కోసం 1971లో పార్లమెంటు రాజ్యాంగానికి 26వ సవరణ చేసింది.
1973 కేశవానంద భారతి కేసు దేశ న్యాయవ్యవస్థలో ఎప్పటికీ నిలిచిపోయే కేసు. భారత రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్ని మార్చకూడదన్న సాధారణ న్యాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పోరాడింది. రాజ్యాంగానికి చేసిన 24, 25, 29వ సవరణల రాజ్యాంగ చట్టబద్ధత గురించి కాంగ్రెస్ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీవ్రంగా చట్టపరమైన యుద్ధమే చేసాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు మార్చలేదు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ 7-6 తేడాతో తీర్పునిచ్చింది. దానికి ఇందిరాగాంధీ 1973 ఏప్రిల్ 25న ప్రతీకారం తీర్చుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా అభిప్రాయం ప్రకటించిన న్యాయమూర్తుల్లో ఒకడైన జస్టిస్ ‘ఎ.ఎన్ రే’ని సీజేఐగా నియమించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్లో ముగ్గురు సీనియర్లు ఉన్నా, వారిలో ఎవరినీ సీజేఐగా నియమించలేదు. దాంతో ఆ ముగ్గురూ తమ పదవికి రాజీనామా చేసారు. ఇందిర చర్య దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండకూడదన్న స్పష్టమైన హెచ్చరిక.
భారత రాజ్యాంగం ఈ దేశపు సామాన్య పౌరుడికి ఇచ్చిన కనీస రక్షణ చర్య న్యాయ సమీక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల నిర్ణయాలు న్యాయస్థానాల్లో పలుమార్లు ఓడిపోవడంతో ఆ పార్టీ న్యాయవ్యవస్థ మీద కక్ష పెట్టుకుంది. జ్యుడీషియల్ రివ్యూ అనే రాజ్యాంగ పద్ధతిని తొలగించివేసింది.
ఇందిరాగాంధీ ఎన్నికపై ఆమె రాజకీయ ప్రత్యర్ధి రాజ్‌నారాయణ్ వేసిన కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందిరకు, న్యాయవ్యవస్థపై ఆగ్రహావేశాలను మరింత పెరిగేలా చేసింది. ఇందిరాగాంధీ తరఫున నానీ పాల్కీవాలా వాదిస్తే, రాజ్‌నారాయణ్ తరఫున శాంతిభూషణ్ వాదించారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రధానమంత్రిని ఐదు గంటలు కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేసారు. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్ట్ జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా, ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, ఆమె ఎన్నిక చెల్లదనీ తీర్పునిచ్చారు. ఆరేళ్ళపాటు ఇందిర ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆదేశించారు. ఆమెను లోక్‌సభ నుంచి తొలగించారు. ఆ తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న ఇందిరాగాంధీ, తీర్పుపై పూర్తి స్టే కోసం ప్రయత్నించింది. కానీ సుప్రీంకోర్టు పాక్షిక స్టే మంజూరు చేసింది. ఆమెను ఓటింగ్ నుంచి డిబార్ చేసింది. ఆ పరిణామం ఇందిర రాజకీయ జీవితానికి పెద్ద ఎదురుదెబ్బ. ఆ దెబ్బకే ఇందిరాగాంధీ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించింది.
నిర్లక్ష్యపూర్వక సవరణలతో రాజ్యాంగానికి తూట్లు
కాంగ్రెస్ ప్రభుత్వాలకు దేశంలోని రాజ్యాంగ వ్యవస్థపై అణుమాత్రమైనా గౌరవం లేదు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకే రాజ్యాంగానికి తరచుగా సవరణలు చేసారు. ఎమర్జెన్సీలు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు న్యాయవ్యవస్థకు రాజ్యాంగం అందించిన అధికారాలకు కోతలు పెట్టాయి, దేశ ప్రజలకు కోర్టుకు వెళ్ళడానిక ఉన్న హక్కునూ దెబ్బతీసాయి. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేసి దేశపౌరుల కీలక హక్కులను హరించివేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రత్యేకత. రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ వైఖరికి 38వ సవరణే పెద్ద నిదర్శనం.
1975 ఆగస్టు 10న కాంగ్రెస్ ప్రభుత్వం 39వ సవరణ ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ల ఎన్నికను న్యాయస్థానాలు తనిఖీ చేయడాన్ని నిలువరించింది. 1976లో చేసిన 42వ సవరణ అయితే భారత రాజ్యాంగానికి తగిలిన అతిపెద్ద దెబ్బ. ఆ సవరణ ఎంత విస్తృతమైనదంటే ఆ సవరణ చట్టాన్ని ఏకంగా ‘మినీ రాజ్యాంగం’ అని వ్యవహరిస్తారు. ఉన్నత న్యాయస్థానాలకుండే న్యాయ సమీక్ష అధికారాన్ని ఆ సవరణ ద్వారా తీసివేసారు. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ల విచక్షణాధికారాల పరిధిని పెంచారు. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ప్రభుత్వం అవసరం అనుకున్న సమయాల్లో ప్రాథమిక హక్కులను ఆటోమేటిక్‌గా సస్పెండ్ చేసే అధికారం ఇచ్చారు. అంతేకాదు, రాజ్యాంగ సవరణలను న్యాయస్థానాల్లో సవాల్ చేయకుండా ఉండేలా రాజ్యాంగ అధికరణం 368ని సవరించారు. అటువంటి దారుణమైన అంశాలను 1978లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపసంహరించింది.
ఇందిరాగాంధీ 1951 నాటి ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సైతం సవరించింది. ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ల విచారణ ఆధారంగా కోర్టులు నిర్ణయించే అనర్హతను తొలగించే అధికారాన్ని రాష్ట్రపతికి కట్టబెట్టింది. ఆ సవరణ లక్ష్యం అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక అనర్హమైనది అంటూ ఇచ్చిన తీర్పును రద్దు చేయించుకోవాలన్న ఉద్దేశమే. రాజ్యాంగాన్ని నరికి పోగులు పెట్టే విషయంలో మొదటి అడుగు కాంగ్రెస్ పార్టీదే. పౌరులకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను, ప్రాథమిక హక్కులను హరించివేయడం, కార్యకర్తలను ఏ కారణమూ లేకుండా జైలుపాలు చేయడం, విచారణకు కానీ న్యాయసమీక్షకు కానీ అవకాశం లేకుండా ఊచల వెనుక నెట్టివేయడం, పాత్రికేయ రంగంపై సెన్సార్షిప్ అమలు చేయడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అరాచకాలకు పుట్టినిల్లు కాంగ్రెస్ పార్టీయే. రాజ్యాంగం ఇచ్చిన అసాధారణ అధికారాలను ఉపయోగించి కేంద్ర రాష్ట్ర స్థాయులలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థుల పౌరహక్కులను హరించివేసిన ఘటనలు కోకొల్లలు. ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బ్రిటిష్ పాలకుల కంటె దారుణంగా వ్యవహరించాయి. ప్రత్యర్థి నేతలే కాదు, తమ పార్టీలోని చంద్రశేఖర్, రాంధావన్ వంటి తిరుగుబాటు నాయకులను సైతం అరెస్టులు చేయించాయి. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను నిషేధించాయి.
ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద 34,988 మంది ప్రజలను అరెస్ట్ చేసారు. డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద 75,818 మందిని అరెస్ట్ చేసారు. మరెన్నో వేలమందిని భయంకరంగా చిత్రవధలు పెట్టారు.
మదర్లాండ్ దినపత్రికకు సంపాదకుడు, ఆర్గనైజర్ వారపత్రికకు సుదీర్ఘకాలం ఎడిటర్‌గా పనిచేసిన కెఆర్ మల్కానీని 1975 జూన్ 25 రాత్రి ఎమర్జెన్సీ విధించిన వెంటనే మీసా చట్టం కింద అరెస్ట్ చేసారు. 1977 మార్చ్ 21న ఎమర్జెన్సీ అధికారికంగా తొలగించేవరకూ అంటే 22 నెలల పాటు ఆయనను జైల్లో నిర్బంధించారు. ఎమర్జెన్సీ కాలంలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరించివేసారు. దినపత్రికలపై సెన్సార్షిప్ విధించారు. మల్కానీయే కాదు, మరెంతో మంది జర్నలిస్టులను సైతం అరెస్ట్ చేసారు. ఆ పరిస్థితిని మల్కానీ ముందుగానే ఊహించారు. 1975 జనవరి మదర్లాండ్ పత్రికలో ఇందిరాగాంధీ త్వరలోనే అత్యవసర పరిస్థితి ప్రకటిస్తుందని, తనను వ్యతిరేకించే వారిని జైళ్ళలో నిర్బంధిస్తుందని, ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తుందనీ రాసారు. కానీ ఆ సమయంలో ఎవరూ ఆయన అంచనాను విశ్వసించలేదు.
రాజ్యాంగాన్ని ఇంకా ధ్వంసం చేస్తూనే ఉన్న కాంగ్రెస్
ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందన్న విషయాన్ని తప్పుగా అంచనా వేసుకుంది. 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలుమై ప్రకటించారు. భారతీయ ఓటర్లు అప్పుడు తమ రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. ఒక అరాచక పార్టీ పరిపాలనను సహించబోమన్న తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో చూపించారు. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్‌ను భారీగా ఓడించిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితిని తొలగించింది. అయితే, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కొంతమంది దుర్మార్గులు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఏమీ మారలేదు, చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోలేదు. రాజ్యాంగాన్ని తూతూమంత్రంగా గౌరవించడం అనే కాంగ్రెస్ సంప్రదాయం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొనసాగింది. షాబానో కేసులో ఒక ముస్లిం మహిళకు తన భర్త నుంచి భరణం తీసుకోడానికి హక్కుందని కోర్టు తీర్పు ఇస్తే, ఆ తీర్పును రద్దు చేయడం కోసం ఏకంగా చట్టాన్నే చేసింది.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం 93వ రాజ్యాంగ సవరణ చేసింది. మైనారిటీ విద్యాసంస్థల్లో ఎస్సి, ఎస్టి విద్యార్ధుల రిజర్వేషన్‌ను తగ్గించి ముస్లిముకు మరిన్ని సీట్లు కేటాయించాలని రంగనాథ్ మిశ్రా కమిటీ, సచార్ కమిటీ సిఫారసు చేసాయి. మైనారిటీ ఓట్ల కోసం ఆ సిఫారసుల ద్వారా బుజ్జగింపు రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది.
ఇప్పటివరకూ వరుసగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగానికి 80 సవరణలు చేసాయి. తద్వారా రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసి అవమానించాయి. రాజ్యాంగ స్ఫూర్తిని పలురకాలుగా హత్య చేసాయి. అటువంటి కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల నేతలను రాజ్యాంగ వ్యతిరేకులు అని ప్రచారం చేయడం హాస్యాస్పదం.