టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా డీఎస్సీలో టెట్ మార్క్లకు 20 శాతం వెయిటేజ్ కల్పించనున్నారు. మరోసారి టెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,35,907 మంది పరీక్షలు రాయగా 1,37,904 మంది ఉత్తీర్ణులయ్యారు. 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
టెట్-2024 ఫలితాలు పేపర్ల వారిగా ఇలా ఉన్నాయి. పేపర్ 1(ఏ) ఎస్జీటీ రెగ్యులర్ పరీక్షకు 1,13,296 దరఖాస్తు చేసుకోగా 78,142మంది అంటే 66.32 శాతం మంది అర్హత సాధించారు. పేపర్ 1(బి) ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 1700 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 790 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2(ఏ) స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పరీక్షలకు 1,19,500 దరఖాస్తు చేసుకుంటే.. వారిలో 60,846 మంది అర్హత పొందారు. పేపర్ 2(బి) స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 1,411మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,125 మంది ఉత్తీర్ణులయ్యారు.
టెట్ ఫలితాలు వెల్లడి తర్వాత మాట్లాడిన మంత్రి నారా లోకేశ్, అర్హత సాధించినవారికి శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని సూచించారు. మరోసారి టెట్ నిర్వహిస్తామని, ఫలితాల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని వివరించారు.