ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్‌పై స్టే ఎత్తివేతకు నిరాకరించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వు లోపభూయిష్టంగా ఉందని.. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 21న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈడీ దిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు స్టే విధించింది.
ఈడీ పిటిషన్ ను హైకోర్టు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం విచారించింది. ట్రయిల్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులు పై స్టే విధించింది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాల్ని ఎత్తి చూపడంతో పాటు ఈడీ వాదనకు తగినంత సమయం ఇవ్వవపోవడం, షరతులను సరిగ్గా చర్చించడంలో విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై దిల్లీ హైకోర్టు స్టే విధించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రేపు విచారణకు రానుంది.
లిక్కర్ పాలసీ కేసు విచారణలో భాగంగా మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మధ్యలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల రావడంతో 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.