తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. మంత్రుల తరవాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం చూస్తుంటే, తనకు ప్రతిపక్షనేత హోదా ఇచ్చే అవకాశం కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే పది శాతం సీట్లు గెలవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన గుర్తుచేశారు.
1984లో తెలుగుదేశం పార్టీకి 34 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చినా లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీ ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని గుర్తుచేశారు. 1994లో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చినా, అప్పటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్ధన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించారని గుర్తుచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే పది శాతం సీట్లు గెలవాలనే నిబంధనలున్నాయని అధికార పక్షం వాదిస్తోంది.