భారత రాజ్యాంగానికి ఇప్పటివరకూ చేసిన సవరణలు అన్నింటిలోనూ అత్యంత సమగ్రమైన సవరణ 1976లో చేసిన 42వ సవరణ. అందుకే ఆ చట్టాన్ని మినీ రాజ్యాంగం అని కూడా వ్యవహరిస్తారు. స్వరణ్‌సింగ్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసింది. ఆ సవరణ రాజ్యాంగ ప్రవేశికను, రాజ్యాంగంలోని 40 అధికరణాలను, ఏడవ షెడ్యూలును సవరించింది. రాజ్యాంగానికి 14 కొత్త అధికరణాలను, రెండు కొత్తభాగాలనూ జోడించింది.
ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థలపై దాడి
n ఏ దశలోనూ, ఏ ప్రాతిపదికనా న్యాయ పరిశీలన అన్నదే లేకుండా రాజ్యాంగ సవరణలు చేసారు
n కొన్ని చట్టాలను సవాల్ చేయడానికి అవకాశమే లేకుండా చేసారు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ పొందే హక్కు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు వంటి ప్రాథమిక హక్కులు ఉండే రాజ్యాంగంలోని మూడవ భాగం ఆధారంగా ఆ చట్టాలకు మినహాయింపు ఇచ్చారు.
n సుప్రీంకోర్టుకు, హైకోర్టులకూ ఉన్న న్యాయసమీక్షా అధికారాన్ని, రిట్ జ్యూరిస్‌డిక్షన్‌ని తొలగించారు.
n అధికరణం 14, 19 లేదా 31ని ఉల్లంఘించిన ప్రాతిపదికన దేశసూత్రాల అమలు కోసం చేసిన చట్టాలను కోర్టులు ‘చెల్లుబాటు కావు’ అని నిర్ణయించలేవు.
n జాతి వ్యతిరేక కార్యకలాపాలతో వ్యవహరించడం కోసం చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారాలు ఇచ్చారు. అటువంటి చట్టాలకు, ప్రాధమిక హక్కుల కంటె ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
n భారత ప్రభుత్వపు వ్యవహారాల్లో సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రాష్ట్రపతి నియమాలు రూపొందించాలని కోర్టు ఆదేశించజాలదు.
n ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు దాని వ్యవధిని ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచవచ్చు.
n దేశంలో ఎక్కడినుంచి అయినా జాతీయ అత్యవసర పరిస్థితిని బహిరంగంగా ప్రకటించవచ్చు
n మూడు కొత్త ఆదేశ సూత్రాలను పొందుపరిచారు: సమన్యాయం-ఉచిత న్యాయసహాయం అందించడం, పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం, పర్యావరణం-అడవులు-జంతుజీవాల రక్షణ.
n పౌరులు చేయవలసిన ప్రాథమిక విధులను వెల్లడించే పార్ట్ 4ఎ భాగాన్ని జోడించారు.
పార్లమెంటు, రాష్ట్ర శాసనాలు
n మంత్రివర్గం సలహా సూచనలకు రాష్ట్రపతి కట్టుబడి ఉండేలా చేసారు.
n లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఐదు నుంచి ఆరు ఏళ్ళకు పెంచారు.
n పార్లమెంటులోనూ, రాష్ట్రాల శాసనసభల్లోనూ కోరం ఆవశ్యకతను తొలగించారు.
n పార్లమెంటు సభ్యులు, కమిటీల హక్కులు, ప్రాధమ్యాలను ఎప్పటికప్పుడు నిర్ణయించుకునే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టింది.
n 1971 జనాభా ప్రాతిపదికన లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని స్థానాల సంఖ్యను 2001 వరకూ యథాతథంగా ఉంచేసింది.
ఏడవ షెడ్యూలు సవరణ
n కేంద్రప్రభుత్వ సాయుధ బలగాలను ఏదైనా రాష్ట్రంలో మోహరించడం, వాటి అధికారాలు, బాధ్యతలు అనే అంశాన్ని కేంద్ర జాబితాలో జోడించారు.
n విద్య; అడవులు; వన్యప్రాణుల రక్షణ; తూనికలు-కొలతలు; సుప్రీంకోర్టు, హైకోర్టులు మినహా మిగతా అన్ని న్యాయస్థానాల ఏర్పాటు, నిర్వహణ, సంబంధిత వ్యవహారాలు – అనే ఐదు అంశాలను రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చారు.
n జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు
ఇతర మార్పులు
n రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్టు, సెక్యులర్, సమగ్రత అనే మూడు కొత్త పదాలు చేర్చారు
n శాంతిభద్రతలు క్షీణించిన పరిస్థితిలో ఏ రాష్ట్రంలోనైనా సాయుధ బలగాలను మోహరించడానికి కేంద్రానికి అధికారం కట్టబెట్టారు
n ఎవరైనా ప్రభుత్వోద్యోగిపై విచారణ జరిగి, జరిమానా విధించినప్పుడు అతనికి వాదించుకునే అవకాశం లేకుండా చేసి క్రమశిక్షణా చర్యల ప్రక్రియను కుదించారు.
n నిర్వహణ, తదితర వ్యవహారాలకు ట్రిబ్యునళ్ళ ఏర్పాటు కోసం రాజ్యాంగంలో 14ఎ భాగాన్ని జోడించారు.
n అఖిల భారత జ్యుడీషియల్ సర్వీసు కోసం అవకాశం కల్పించారు.