ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నందున బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. దీంతో 26 సాయంత్రం నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ముసురు పట్టే అవకాశముంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 27, 28న అనేక చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని అంచనా వేశారు.
కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో 115.5 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.దేశంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణశాఖ వడగాలుల హెచ్చరికను కూడా జారీ చేసింది. పంజాబ్, బిహార్‌లోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది.