నిర్మాణం జరిగి ఆరు నెలలు కూడా గడవనే లేదు అయోధ్య రామాలయంలో నిర్మాణ పరమైన సమస్యలు బయటపడ్డాయి. అయోధ్య రామాలయం గర్భాలయంలోకి వర్షపు నీళ్ళు లీకు కావడంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా గర్భగుడిలో బాలరాముడిని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట, దర్శనార్థం వీఐపీ భక్తులు వచ్చే మార్గంలోనూ వర్షపు నీరు లీక్ అవుతోందని దాస్ తెలిపారు. వర్షపు నీరు బయటకు వెళ్ళేందుకు డ్రెయినేజీ లేకపోవడాన్ని తక్షణ సమస్యగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ యాజమాన్యాన్ని ఆయన కోరారు.
దేశవ్యాప్తంగా పేరున్న దిగ్గజ ఇంజనీర్లు అయోధ్య ఆలయ నిర్మాణంలో సేవలందించారు. అయినప్పటికీ కొన్ని సమస్యలు బయటపడ్డాయి. జనవరి 22న ఆలయం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత తొలి భారీ వర్షానికే నీరు లీక్ అవడం ఆశ్చర్యం వేస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ‘‘ ఆలయం మొదటి అంతస్తులో ఇంకా పనులు పూర్తికాలేదని జూలైకల్లా పూర్తిచేస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం ఆలయనిర్మాణం పూర్తి అవుతుందన్నారు.